
జనగామ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని చూశాడు ఓ తండ్రి. రెండో భార్యతో కలిసి బిస్కెట్లలో విషం పెట్టి చంపాలని చూశాడు. అందుకోసం భారీగా సుపారీ కూడా ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బడి తండా లో 2026 ఏప్రిల్ 16న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బానోతు శ్రీనివాస్ అనే వ్యక్తికి 2016 లో అనిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ కలహాలతో వేరే గ్రామానికీ చెందిన మూడవత్ మమత అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు.
శ్రీనివాస్ కుటుంబానికి ఉన్న భూమిలో 20 గుంటల భూమి కుమారుల పేరు మీద ఉంది. దీంతో కుమారులను చంపేస్తే భూమి తమకే వస్తుందని రెండో భార్యతో కలిసి ప్లాన్ చేశాడు. బిస్కట్ లో విషం పెట్టి చంపాలని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి సుపారీ ఇచ్చారు.
సుపారీ తీసుకున్న వ్యక్తి ముందు ఒప్పుకున్నా.. చంపాలంటే భయం వేసి ఆ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి శ్రీనివాస్ దంపతులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది జనగామ న్యాయస్థానం.