
- ఈ ఘనత సాధించిన ఇండియా తొలి మహిళగా చరిత్ర
- ఫిడే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత
పాఫోస్ (సైప్రస్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎవరికీ సాధ్యం కాని ప్రతిష్టాత్మక ‘విమెన్స్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్‌లో వైశాలి 48 ఎత్తుల వద్ద లాగ్నా కేథరిన్ (ఉక్రెయిన్)పై సంచలన విజయం సాధించింది. ఫలితంగా 8.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
దాంతో క్యాండిడేట్స్ టైటిల్‌ను నెగ్గిన ఇండియా తొలి విమెన్ గ్రాండ్ మాస్టర్‌గా 24 ఏండ్ల వైశాలి రికార్డులకెక్కింది. అలాగే ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇక కేథరిన్‌తో జరిగిన గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన వైశాలి సుదీర్ఘమైన వ్యూహాలతో అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఆరంభంలో కేథరిన్ చకచకా ఎత్తులతో ఆధిక్యం సాధించినా.. మిడిల్ గేమ్‌ను వైశాలి బాగా కంట్రోల్ చేసింది.
ఎండ్ గేమ్‌లో తన ట్రేడ్ మార్క్ స్ట్రాటజీతో పైచేయి సాధించింది. కజకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ అస్సాఉబయోవా బిబిసారా (8)తో జరిగిన ఆఖరి గేమ్‌ను ఇండియా గ్రాండ్ దివ్య దేశ్‌ముఖ్ 36 ఎత్తుల వద్ద డ్రాగా ముగించడం కూడా వైశాలికి కలిసొచ్చింది. దివ్య ఐదున్నర పాయింట్లతో టాన్ జాంగ్‌యి (చైనా)తో కలిసి సంయుక్తంగా ఏడో ప్లేస్‌లో నిలిచింది. అలెగ్జాండ్రా గొరియాచుకినా (7.5), జు జినెర్ (7.5) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వైశాలి.. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ జు వెన్‌జు (చైనా)తో తలపడనుంది. టోర్నీకి సంబంధించిన వేదిక, తేదీలు ఇంకా ఖరారు చేయలేదు.
గుకేశ్ ప్రత్యర్థి సిందరోవ్
భారీ అంచనాలతో ఓపెన్ సెక్షన్‌లో బరిలోకి దిగిన ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. ఈ టోర్నీలో అద్భుతం చేయలేకపోయాడు. హికరు నకమురాతో జరిగిన ఆఖరి రౌండ్ గేమ్‌ను 33 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఫలితంగా ఆరు పాయింట్లతో మథియాస్ బ్లూబామ్‌తో కలిసి సంయుక్తంగా ఆరో ప్లేస్‌లో నిలిచాడు.
ఇప్పటికే టైటిల్‌ను ఖరారు చేసుకున్న జావోకిర్ సిందరోవ్ (10).. వీ యి (7)తో జరిగిన గేమ్‌ను 32 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. అనీష్ గిరి (8.5), ఫాబియానో కరువాన (7.5) వరుసగా రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌తో సిందరోవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.