Reading Time: < 1 minute

మీ సేవ సెంటర్లలో ఏసీబీ సోదాలు.. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు

Caption of Image.
  • ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మీ సేవ సెంటర్లలో దళారుల దందాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మీ సేవ సెంటర్ల నిర్వాహకులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌‌‌‌లోని ఖైరతాబాద్, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్, అల్వాల్, మల్లేపల్లి, తార్నాక మీ సేవ సెంటర్లతో పాటు నిజామాబాద్‌‌‌‌, మెదక్, వరంగల్‌‌‌‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. 

సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించింది. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు రోజువారీ కలెక్షన్ వివరాలను సేకరించింది. అనుమానిత లావాదేవీలకు సంబంధించి సంబంధిత సెంటర్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులను ప్రశ్నించింది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.‌‌‌‌

రాష్ట్రంలో ప్రభుత్వ పౌర సేవలకు సంబంధించి మీ సేవ సెంటర్ల ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు పలు రకాల ధృవపత్రాలకు మీ సేవ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

వీటితో పాటు ఆన్‌‌‌‌లైన్ అప్లికేషన్లను అకారణంగా పెండింగ్‌‌‌‌లో పెట్టడం, దళారుల ద్వారా వచ్చే అప్లికేషన్లను డబ్బు తీసుకుని  వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి చేరాల్సిన ఫీజ్ మొత్తాన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌క్షన్‌‌‌‌ కాకుండా ఫీజుకు అదనంగా వసూలు చేస్తూ గూగుల్‌‌‌‌పే, ఫోన్‌‌‌‌ పేలతో డిపాజిట్లు చేసుకుంటున్నట్లు బాధితులు ఏసీబీ సమాచారం అందించారు. ఈ క్రమంలోనే మీసేవ సెంటర్లలోని నగదు, అప్లికేషన్లు, పెండింగ్ లిస్ట్, సిబ్బంది వ్యక్తిగత అకౌంట్లలను ఏసీబీ అధికారులు పరిశీలించారు.

©️ VIL Media Pvt Ltd.