
న్యూఢిల్లీ: డెన్మార్క్ స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏండ్ల వయసులోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీర్ఘకాలిక వెన్ను నొప్పి వల్లే తాను ఈ వీడ్కోలు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బుధవారం వెల్లడించాడు. ‘చాలా కాలం నుంచి నేను వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం చాలా మందికి తెలుసు. గతేడాది ఏప్రిల్‌లో సర్జరీ తర్వాత బాగానే కోలుకున్నా. కానీ అక్టోబర్‌లో మళ్లీ నొప్పి తిరగబెట్టింది. అప్పటి నుంచి కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నా.
నొప్పితో బాధపడుతూ ఆడటం అసాధ్యం. అందుకే డాక్టర్ల సలహా మేరకు ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా’ అని అక్సెల్సెన్ పేర్కొన్నాడు. 1994లో జన్మించిన అక్సెల్సెన్ ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టాడు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా స్వర్ణాలు సాధించిన అక్సెల్సెన్.. 2017, 2022లో వరల్డ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక కెరీర్‌లో 183 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగడం ద్వారా మరో రికార్డును అందుకున్నాడు.