
రష్యా, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను కొనసాగించకూడదని అమెరికా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రూడ్ వినియోగదారుగా ఉన్న భారత్‌పై ఈ ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా తన ఆంక్షలను కఠినతరం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ రిఫైనరీలకు కొత్త సవాళ్లను కలిగించే అవకాశం ఉంది.
ఇరాన్ యుద్ధం ప్రారంభం సమయంలో మార్చి 11 కంటే ముందు సముద్రంలో ఉన్న క్రూడ్ ఆయిల్ నిల్వలను గమ్యస్థానాలకు చేర్చేందుకు అమెరికా ఇచ్చిన వెసులుబాటు గడువు ప్రస్తుతం ముగిసింది. భారత్ ఈ కాలంలో రష్యా నుంచి దాదాపుగా 30 మిలియన్ బారెళ్ల క్రూడ్ కొనుగోలు చేసింది. అలాగే దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి కూడా స్వల్ప స్థాయిలో దిగుమతులు జరిగాయి. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేసినట్లుగా.. ఇకపై ఇలాంటి మినహాయింపులు ఉండవు. ఇది రష్యా ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న భారతీయ కంపెనీలకు వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా మారవచ్చు.
ఇరాన్ విషయంలో అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై ‘సెకండరీ శాంక్షన్స్’ విధిస్తామని హెచ్చరించడం ఆందోళన కలిగించే అంశం. ఒకప్పుడు భారత్ ఇంధన అవసరాల్లో 11.5 శాతం వాటాను ఇరాన్ భర్తీ చేసేది. కానీ 2019 నుండి అది నిలిచిపోయింది. తాజాగా వచ్చిన చిన్నపాటి వెసులుబాటుతో అందిన 4 మిలియన్ బారెళ్ల సరఫరా కూడా ఇకపై సాధ్యం కాకపోవచ్చు. ఇరాన్ డబ్బులు ఏ బ్యాంకులో ఉన్నా వాటిపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికలు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా సవాలుగా మారనున్నాయి.
అయితే భారత్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాల నుండి చమురును సేకరించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. మధ్యప్రాచ్యం, అమెరికా నుండి దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా, ఇరాన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. రాబోయే వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా అమలు చేసే ఆంక్షల తీవ్రతను బట్టి భారత్ తన ఇంధన భద్రతను ఏ విధంగా కాపాడుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే భారత రిఫైనరీలు ఎటువంటి అదనపు రక్షణ కవచం లేకుండానే గ్లోబల్ మార్కెట్లో పోటీ పడాల్సిన పరిస్థితి కొనసాగనుంది. మరోపక్క ట్రంప్ మాత్రం తాను యుద్ధాన్ని ముగిస్తే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోతాయంటూ కామెంట్స్ చేశారు.