Reading Time: < 1 minute

Anudeep Katikala: పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్!

Caption of Image.

స్టాండప్ కమెడియన్ అనుదీప్ కాటికాల అరెస్ట్ అయ్యాడు. ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మెగా డాటర్ నిహారికల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికలను కాకినాడ పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుదీప్ జోకులు పేల్చడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయ, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ (JSP) ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పార్టీ కార్యకర్త బడే వెంకట కృష్ణ కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అనుదీప్ అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, BNS సెక్షన్లు 356(2), 353(2), 79తో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు. మంగళవారం (ఏప్రిల్ 14) సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

అసలేం జరిగింది?

అనుదీప్ కాటికాల మాట్లాడిన వీడియోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుదీప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారి నుండి నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భార్యకు విడాకులు ఎలా ఇవ్వాలి అనేది. మగవారందరూ ఆయనను చూసి ఇది నేర్చుకోవాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంతటితో ఆగకుండా, మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల గురించి ప్రస్తావిస్తూ.. నేను గనుక నిహారిక స్థానంలో ఉంటే, కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే కాల్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో విడాకుల విషయంలో అత్యధిక అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే కదా.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

అలాగే రామ్ చరణ్ , ఉపాసనల ఆర్థిక స్థితిగతులపై కూడా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. రాజకీయంగా, సినీపరంగా ఎంతో ఎత్తులో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులు అనుదీప్ కాటికాల అరెస్ట్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.