
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ . క్రీడలు, గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్‌గాఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ సినిమా కోసం అయితే ఎంతో ఆత్రుతలో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు. మరో సారి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వాయిదాకు అసలు కారణం ఇదే!
ఈ సినిమాను తొలుత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దానిని ఏప్రిల్ 30కి మార్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఏవీ ప్రారంభం కాకపోవడంతో విడుదల వాయిదా పడటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ముందే ఊహించాయి. లేటెస్ట్ గా మేకర్స్ స్పందిస్తూ, సినిమాను జూన్ 2026 లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, జూన్‌లో ఏ తేదీన వస్తుందనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు.
ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందని, అవుట్‌పుట్ విషయంలో తాము చాలా సంతృప్తిగా ఉన్నామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ (VFX) పనులకు మరింత సమయం కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తెలిపారు. దీనితో పాటు ఐపీఎల్ (IPL) హడావుడి కూడా ఒక కారణంగా వినిపిస్తోంది.
We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/io4MFHfXJy
— PEDDI (@PeddiMovieOffl) April 15, 2026
భారీ తారాగణం..
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ , బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
ఈ సినిమాలో రామ్ చరణ్ ఎప్పుడూ చూడని రీతిలో రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు సానా రాసుకున్న ఈ కథలో ఎమోషన్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తోంది. విడుదల వాయిదా పడటం అభిమానులను కాస్త నిరాశపరిచినా, క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం కావడంతో సర్దుకుపోతున్నారు. జూన్‌లో రామ్ చరణ్ తన ‘పెద్ది’ అవతారంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి..