Reading Time: < 1 minute

ఇబ్రహీంపట్నం: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని ఎంత వరకు అమలు చేసిందని ప్రశ్నించారు.

‘‘సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో.. ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరించి.. గద్దెనెక్కి గడిచిన రెండున్నరేళ్లలో 11వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. స్కూటీలు, నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మహిళలను కూడా మోసం చేశారు. రెండు నెలల పింఛను ఇవ్వకుండా వృద్ధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. గడిచిన 28 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు’’ అని కెటిఆర్ విమర్శించారు.