
హైదరాబాద్: హైదరాబాద్లోని చందానగర్‌లో బెలూన్లలో నింపే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో కలకలం రేపింది. GSM మాల్ ఎదురుగా సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బెలూన్లు నింపే గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి కాలు తెగి పడింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల వివేక్ పాల్ ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చందానగర్‌లోని అయ్యప్ప ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు.
గాయపడిన వారిలో ముల్లగాని జనార్ధన్, 16 ఏళ్ల నంద్యాల దనూష అనే శ్రీచైతన్య కళాశాల విద్యార్థిని ఉన్నారు. మరొకరు 25 ఏళ్ల IT ఉద్యోగి విన్నకోట సింధుప్రియకు స్వల్ప గాయాలయ్యాయి. బెలూన్లు నింపేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నుంచే పేలుడు జరిగినట్లు సమాచారం. బెలూన్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జయరామ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా. సిలిండర్ పేలడానికి కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.