Reading Time: < 1 minute
Russia Railway Link Indian Ocean India

Russia-india Rail Route: రష్యా నుంచి భారత్ వరకు రైలు మార్గం నిర్మాణంపై రష్యా దృష్టి సారిస్తుంది. భారత్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని రష్యా భావిస్తోంది. బోస్ఫరస్, హార్ముజ్ జలసంధులపై ఆధారపడకుండా ప్రత్నామ్యాయం మార్గాలు అవసరమని ఆ దేశ ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ ఆ దేశ మీడియాతో అన్నారు. తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని, భారత్ చేరుకునే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమే అని అన్నారు. రష్యా నిర్మాణ రంగానికి ప్రస్తుతం దీర్ఘకాలిక ఆర్థిక వనరులు అవసరమని తెలిపారు.

అమెరికా-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 25 శాతం, ఎల్‌ఎన్‌జీ రవాణాలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి మీదుగా సాగుతుంది. దీంతో ఈ కీలక సముద్ర మార్గంలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే పరిస్థితి ఉంది. భారత్ కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది.

రష్యా ప్రతిపాదిత ప్రాజెక్టు ఒక వేళ పట్టాలెక్కితే భారత్‌కు ఇంధన భద్రత మరింత పెరుగుతుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్, ఎరువులు ఈజీగా భారత్ తరలించవచ్చు. అయితే, ఇక్కడ ఈ మార్గం అస్థిరతకు మారుపేరైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా రావాల్సి ఉంటుంది. భౌగోళిక, భద్రతా, మౌలిక వసతుల పరంగా అనేక సవాళ్లు ఉన్నాయి.