
బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగళూరులోని బాగలగుంటె ఏరియాలో ఒక డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం దొరికింది. చనిపోయిన వృద్ధురాలిని 52 ఏళ్ల దక్షాయణిగా గుర్తించారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఇంట్లో ఆమె మృతదేహాన్ని ఎవరూ గమనించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన బాగలగుంటెలోని హవనూర్ లేఅవుట్ ఏరియాలో జరిగింది. దక్షాయణి అనే మహిళ భర్త, కొడుకు చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉండేది.
భర్త, కొడుకు మరణంతో తీవ్ర మానసిక క్షోభతో, ఒంటరితనంతో ఆమె మానసికంగా కుంగి కృశించి పోయింది. ఆమె జీవితం శూన్యమైపోయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమె కొడుకును క్యాన్సర్ మహమ్మారి మింగేసింది. ఆమెకు కూతురు, అల్లుడు ఉన్నా ఆమె ఇంటి వైపు కూడా ఏనాడూ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దీంతో.. దక్షాయణి ఒంటరితనంతో కాలం వెళ్లదీసింది. సుమారు ఏడాది క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ సంవత్సరం కాలంలో ఆమె కూతురు, అల్లుడు ఆ ఇంటి వైపు కనీసం వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇల్లు కూడా లేఔట్లో విసిరేసినట్లు ఉండటంతో ఇరుగుపొరుగు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. దాదాపు కొన్ని నెలల నుంచి ఈ డ్యూప్లెక్స్ ఇంటికి తాళం వేసి ఉండటం, దక్షాయణి ఎప్పుడూ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా దక్షాయణి అస్థి పంజరం ఇంట్లో కనిపించింది. ఆమె అస్థి పంజరం అవశేషాలను గమనించిన పోలీసులు సంవత్సరం క్రితమే ఆమె చనిపోయి ఉండొచ్చని తెలిపారు. కూతురు, అల్లుడికి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.