Reading Time: 3 minutes
Story Board Over Bangladesh

మనం నాటిన విత్తనం.. మనకే విషంగా మారుతోంది. మనం ఏర్పాటు చేసిన దేశం.. మనకే శత్రువుగా మారుతోంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్‌తో తలబొప్పి కడుతున్న భారత్‌కు.. బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్‌లో తయారౌతోందనే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజకీయ ఆశ్రయం పేరుతో ఢిల్లీ వచ్చిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా.. భారత్ గడ్డపై నుంచి పెట్టిన పొలిటికల్ ప్రెస్‌మీట్ ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. షేక్ హసీనా.. రెండేళ్లుగా భారత్‌లో ఉంటున్నారు. ఓవైపు ఈమెను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న తరుణంలో.. హసీనా మనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టారు. ఢిల్లీలో బంగ్లాదేశ్ రాజకీయాల గురించి ప్రెస్‌ మీట్‌ పెట్టడాన్ని.. బంగ్లాదేశ్ తీవ్రంగా తీసుకుంటోంది. దీంతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతున్నా.. బంగ్లాదేశ్‌కు మాత్రం చాలా అనుమానాలున్నాయి. మరోవైపు ప్రస్తుతం హసీనాకు రాజకీయ ఆశ్రయాన్ని గతంలో ఇందిర చేసిన మానవతా సాయంతో పోల్చిచూడలేమనే చర్చ కూడా జరుగుతోంది.

బంగ్లాదేశ్ మొన్నటిదాకా మన మిత్రదేశమే. అంతేకాదు మనపై చాలా కృతజ్ఞత ఉన్న దేశం కూడా. కానీ ఏ ముహూర్తాన బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం మొదలైందో.. అప్పట్నుంచీ ఆ దేశంలో అంతా మారిపోయింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్ వ్యతిరేకత క్రమంగా కార్చిచ్చులా మారి.. విద్యార్థి ఉద్యమం ముసుగేసుకుని.. భారత్‌ అనుకూల నేతగా ఉన్న షేక్ హసీనాని దేశం నుంచి వెళ్లగొట్టింది. అంతటితో ఆగకుండా ఆమె పార్టీ అవామీలీగ్‌ను లేకుండా చేయాలనే దురాలోచనతో.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, జైలుశిక్షలతో అరాచకం ప్రబలింది. హసీనా తమకు దొరకలేదన్న కోపాన్ని ఈ నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులపైకి మళ్లించారు. హిందూ యువకుల్ని వెంటాడి, వేటాడి చంపారు. చివరకు హిందూ పూజారులు, సన్యాసుల్నీ వదల్లేదు. అంతర్జాతీయంగా పేరున్న ఇస్కాన్ సభ్యుల్ని కూడా వదలకుండా దాడులకు తెగబడటం.. హత్యలు చేయడం పరాకాష్టగా నిలిచింది.

తమ దేశంలో పరిస్థితి అదుపు తప్పడంతో.. ప్రాణభయంతో భారత్‌కు పారిపోయి వచ్చిన హసీనా.. మొదట్లో రాజకీయ ఆశ్రయం కోరారు. కానీ మన సర్కారు అధికారికంగా నిరాకరించింది. కానీ అనధికారికంగా సహకరించారని, అందుకే రెండేళ్లుగా ఆమె ఇక్కడే ఉంటున్నారనేది బంగ్లాదేశ్ ఆరోపణ. అంతకు మించి తమ దేశంలో దోషిగా ఉన్న హసీనాను.. భారత్‌ కాపాడటమేంటని బంగ్లాదేశ్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ కోపంతోనే వారు.. భారత్ తమకు చేసిన సాయాన్ని మర్చిపోయి.. శత్రుత్వం పెంచుకుంటుున్నారు. ఈ పరిణామంతో బంగ్లాదేశ్‌లో కొన్ని భారత్‌ వ్యతిరేక ఛాందస శక్తులకు.. సాధారణ ప్రజల రూపంలో మరింత బలం చేకూరింది. ఆ ఆగ్రహంతోనే బంగ్లాదేశ్‌లో హిందువుల వేట మొదలైంది. చివరకు భారత్‌ జోక్యం చేసుకుని అనుచిత దాడులు ఆపాలని చెప్పినా.. అక్కడ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఈలోగా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. కాకపోతే హసీనా పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. దీనికి తోడు హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా కన్నుమూశారు. దీంతో ఖలీదా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించారు. ప్రధాని అయ్యాక ఇండియా వచ్చిన తారిఖ్ రెహ్మాన్ మన నేతల్ని కలిసి.. భారత్‌తో సత్సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు పూర్తిస్థాయిలో సడలిపోలేదు. ఓవైపు దౌత్యపరంగా సున్నిత పరిస్థితి నెలకొనగా.. మరోవైపు హసీనా ఉన్నట్టుండి.. ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి.. త్వరలో బంగ్లాదేశ్ వెళ్తానని ప్రకటించడం.. బంగ్లాదేశ్‌ అహాన్ని మరింత దెబ్బతీయొచ్చనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే మనం హసీనా రక్షణ కోసం దౌత్యమార్గంతో పాటు అన్ని మార్గాలనూ విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాం. పరిస్థితులు సద్దుమణిగాక.. హసీనాను సైలంట్‌గా స్వదేశం పంపిస్తారనే ఊహాగానాలూ వచ్చాయి. కానీ వీటన్నింటికీ చెక్ పెడుతూ.. హసీనా భారత్‌ గడ్డపై బంగ్లాదేశ్ రాజకీయాల గురించి ప్రెస్‌మీట్ పెట్టడం.. శృతి మించిన చర్యే అంటున్నారు. తన కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్న భారత్ పరిస్థితి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. హసీనా చేసిన ఈ పని.. ఆమెపై మన దేశంలోనూ ఆగ్రహం కలిగేలా చేస్తోంది. ఎందుకంటే హసీనా భారత్‌కు అనుకూల నేతే అయినా.. ఆమె ఒక్కరి కోసం బంగ్లాదేశ్‌లో హిందువులందర్నీ రిస్క్‌లో పెట్టడం కుదరదు. ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాల గురించి హసీనాకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే ఇలా ప్రెస్‌మీట్ పెట్టడం ద్వారా ఆమె పరిస్థితుల్ని మరింత సంక్లిష్టం చేశారనడంలో సందేహం లేదు.

బంగ్లాదేశ్ ప్రస్తుత రాజకీయం అర్థం కావాలంటే.. మనం ఓసారి ఆ దేశ ఆవిర్భావం దగ్గర్నుంచీ చరిత్ర చూడాలి. బంగ్లాదేశ్‌ పేరుకి దేశంగా ఏర్పడ్డ.. అక్కడ ప్రజలు మాత్రం మొదట్నుంచీ పాక్ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగానే మోహరించారు. హసీనా తండ్రి బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ ఆధ్వర్యంలో సాగిన బంగ్లా విముక్తి పోరాటంలోనూ దేశ ప్రజలంతా పాల్గొనలేదనే చర్చ ఉండనే ఉంది. ఇలా తొలినాళ్లలనే రెండు ధృవాలుగా ఏర్పడ్డ బంగ్లాదేశ్‌లో రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. హసీనా నేతృత్వంలో అవామీలీగ్ భారత్ అనుకూల దృక్పథంతో ఉంటే.. ఖలీదా నేతృత్వంలోని బంగ్లా నేషనలిస్ట్ పార్టీ పాక్ అనుకూల దృక్పథంతో ఉండేది. దశాబ్దాలు గడిచినా వీటి వైఖరిలో ఏ మార్పూ లేదు. అందుకు తగ్గట్టుగానే ఖలీదా పాలన వచ్చిన ప్రతిసారీ బంగ్లాలో భారత్ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతుండేవి. అందుకు భిన్నంగా హసీనా అధికారంలోకి రాగానే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేవి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు హసీనా భారత్‌లో ఉండటం.. అంతకు మించి పొలిటికల్ ప్రెస్‌మీట్ పెట్టడం పూర్తిగా ప్రత్యేక పరిస్థితి.

ఆమాటకొస్తే హసీనా భారత్‌ రావడం ఇదే తొలిసారి. తన జీవితంలో భయంకరమైన ఆపద వచ్చినప్పుడు.. తండ్రి కళ్ల ముందే చనిపోయినప్పుడు.. సరిగ్గా చెప్పాలంటే కొన్ని దశాబ్దాల ముందు కూడా ఓ చిన్నారిగా ఇండియా గడ్డపై అడుగుపెట్టారు హసీనా. అలా ప్రాణభయంతో వచ్చిన హసీనా.. అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ అక్కున చేర్చుకున్నారు. మానవతా దృక్పథంతో సాయం చేస్తామని ప్రకటించి.. హసీనా ఓ నేతగా ఎదగటానికి దోహదపడ్డారు. కానీ అప్పట్లో ఎవరూ ఆ చర్యను తప్పుబట్టలేదు. ఎందుకంటే అది కష్ట సమయంలో భారత్ పెద్ద మనసుకు నిదర్శనంగా నిలిచింది. అయితే ఇప్పటి పరిస్థితి అలాంటిది కాదు. ఇప్పుడు హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. బంగ్లాదేశ్ చట్టాలు, కోర్టుల ప్రకారం అక్కడి విద్యార్థి ఉద్యమాన్ని నిరంకుశంగా అణగదొక్కాలని చూసిన దోషి. ఇప్పటికే బంగ్లాదేశ్ కోర్టులు ఆమెకు శిక్షలు విధించాయి. ఇప్పటికైనా హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ కొత్త సర్కారు కూడా భారత్‌ను కోరుతూ వస్తోంది. అయితే బంగ్లా ఇలా అడిగిన ప్రతిసారీ.. దౌత్యపరమైన మార్గాల ద్వారా ఒడుపుగా సమాధానం చెబుతూ వచ్చిన భారత్‌ను.. హసీనా పొలిటికల్ ప్రెస్‌మీట్ ఓ క్షణం డిఫెన్స్‌లో పడేసిందనే చెప్పాలి. చివరకు తేరుకుని ఆ ప్రెస్‌మీట్‌తో తమకు సంబంధం లేదని ఖండన ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్‌ మనసులో ఉన్న అనుమానం పెనుభూతమైంది. భారత్ అండ లేకుండా హసీనా ఇంతకు తెగించబోరని బంగ్లా ప్రస్తుత సర్కారు అనుకుంటోంది. జరిగిన పరిణామాల్ని బట్టి వారలా అనుకోవటాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని కూడా మన దౌత్యవర్గాలు చెబుతున్నాయి.

సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇదే అదనుగా బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ చేయటానికి అక్కడి ఛాందస శక్తులు కాచుక్కూర్చున్నాయి. మనకు వ్యక్తుల కంటే బంగ్లాదేశ్‌తో సంబంధాలే ముఖ్యమని గట్టిగా చాటాల్సిన సందర్భమిది. ఎవరైనా ద్వైపాక్షిక సంబంధాల కంటే ఎక్కువ కాదనే మెసేజ్ దౌత్యమార్గంలో బంగ్లాకు పంపాల్సిందే. అప్పుడు ఆ దేశాన్ని పాక్ విషకౌగిలి నుంచి బయటకు లాగటానికి వీలవుతుంది. లేకపోతే మన కళ్ల ముందే.. మనం పెంచిన దేశం.. మనకే శత్రువుగా మారి.. పాకిస్తాన్ మాదిరిగా కొత్త తలనొప్పిగా మారుతోందనే హెచ్చరికలు వస్తున్నాయి.