
జీవన్‌రెడ్డి తన ఆత్మను చంపుకొని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కౌగిలించుకున్నాడని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ను వదలి ఆ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయన కెసిఆర్ ను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. శనివారం జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు అండగా ఉన్న పార్టీని వదిలి కెసిఆర్ విషకౌగిలిలోకి జీవన్‌రెడ్డి వెళ్లారన్నారు.
జీవన్‌రెడ్డి.. తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడని, కెసిఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై ఇప్పుడు కనిపించకుండా పోయిన సీనియర్ నాయకులను జీవన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. కెసిఆర్ రాక్షస, అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడు? అని ప్రశ్నించారు. అవినీతి పరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెపుతాడా? అంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి పోవాలని, కెసిఆర్ రావాలని ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా అన్నాడా?.. కెసిఆర్ అనే చీడ పురుగును తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారన్నారు.కెసిఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవరూ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు.
–