
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. శుక్రవారం(ఏప్రిల్ 10) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్యంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సూర్యవంశీ కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి, ఆర్‌సిబి బౌలింగ్ దళాన్ని బెంబేలెత్తించాడు. వైభవ్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్‌కు ఫించ్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఆటపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూర్యవంశీ, బ్యాటింగ్ చేసే తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు.
“వైభవ్, హేజిల్‌వుడ్ పై ఆరంభంలోనే ఆధిపత్యం చెలాయించాడు. నేరుగా గ్రౌండ్‌లోకి, వికెట్‌కు స్క్వేర్‌గా బంతిని కొట్టే విధానం నమ్మశక్యం కానిది. పేరుప్రతిష్టలను పక్కనపెట్టి, బంతిని ఎంత దూరం కొట్టగలనో అంత దూరం కొట్టాలనే పట్టుదలతో ఆడటం.. నేను ఇంతవరకు చూడలేదు. యవ్వనంలో ఉండే అజ్ఞానం ఒక అద్భుతమైన విషయం. అతను వీడియో గేమ్‌లలో లాంటి గణాంకాలను నమోదు చేస్తున్నాడు. అతను బంతిని సునాయసంగా కొట్టడం నమ్మశక్యం కానిది” అని ఫించ్ పేర్కోన్నాడు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుతో తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సూర్యవంశీతో పాటు ధ్రువ్ జూరెల్ అజేయంగా 81 పరుగులు చేసి జట్టుకు సునాయసంగా విజయాన్ని అందించాడు. దీంతో రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్ లో గెలచి టేబుల్ టాపర్ గా నిలిచింది.