
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మహేష్ గౌడ్ మండిపడ్డారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారని, స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ని వీడారని తెలియజేశారు. అవినీతి చేశారని మాజీ సిఎం కెసిఆర్ ని ఆయన విమర్శించారని, ఇన్నాళ్లు బిఆర్ఎస్ అవినీతిపై మాట్లాడి అందులోనే చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవమిచ్చామని, బిర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికీ జీవన్ రెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.