Reading Time: < 1 minute

కోల్‌కతా: బెంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాశనం చేసిందని ప్రధాని మోడీ ఫైరయ్యారు. బెంగాల్ లో రాజకీయ హింస, చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు. ఈ నెల 23, 29 తేదీల్లో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం పూర్బా బర్ధమాన్‌లో మొదటి బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP)కి లభిస్తున్న మద్దతు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ‘భయాందోళన’లో ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు పూర్తి భరోసా లభిస్తుందని, రాజకీయ హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ నుండి అక్రమ చొరబాటుదారులందరినీ బహిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

“అవినీతి, శాంతిభద్రతలకు సంబంధించి బీజేపీ ఒక ‘శ్వేతపత్రం’ విడుదల చేస్తుంది. తద్వారా ప్రతి TMC గూండా, సిండికేట్ సభ్యుడు, అవినీతి ఎమ్మెల్యే, మంత్రి చట్టం ముందు పూర్తి బాధ్యత వహించేలా చేయవచ్చు” అని మోడీ అన్నారు. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, సుప్రీం కోర్టు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ నిలిపివేయదని, కేవలం TMC అవినీతిని, దోపిడీని మాత్రమే అంతం చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే, పశ్చిమ బెంగాల్‌లో ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య పథకాన్ని బిజెపి అమలు చేస్తుందని ప్రధాని చెప్పారు.