Reading Time: < 1 minute

హైదరాబాద్: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజీవ్ సింగ్ అనే న్యాయవాది బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు దుండగులు అతడి కోసం వేచి చూస్తున్నారు. అతడు దగ్గరికి రాగానే నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో కిందపడిపోయాడు. ఇద్దరు దుండగులు తప్పించుకోవడానికి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ కాకపోవడంతో స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కాల్పులు జరుపుతామని బెదిరించడంతో వారు వెనక్కి తగ్గారు. వెంటనే బైక్ స్టార్ట్ కావడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాలని పోలీసులకు రాజీవ్ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.