
ఢిల్లీ: రాజ్యసభ అవకాశం దొరకలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి తెలిపారు. బిఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదని, జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నానని మల్లు రవి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించి, 14 సార్లు పార్టీ సభ్యత్వంపై జీవన్ రెడ్డి పోటీ చేశారని చెప్పారు. జీవన్ రెడ్డిని ఇలా చూడడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఎంపిగా పోటీ చేస్తే వారిపైనే జీవన్ రెడ్డి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని, దొరల గడీలకు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి తండ్రి, జీవన్ రెడ్డి పోరాటం చేశారని మల్లు రవి పేర్కొన్నారు.
ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లారని.. కరీంనగర్ ప్రజలకు, రైతులకు జీవన్ రెడ్డి ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలియట్లేదని, పెత్తందారు, దొరల వ్యవస్థకు జీవన్ రెడ్డి అనుకూలంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రత్యేక గుర్తింపు, పదవులు ఇస్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పేది ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని, జీవితం అంత పెంచుకున్న వ్యక్తిత్వాన్ని జీవన్ రెడ్డి దెబ్బతీసుకోకూడదని హితవు పలికారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడడం ఎంతవరకు సమంజసం?.. కెసిఆర్ దగ్గరికి వెళ్లి ఆయన ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. బిఆర్ఎస్ లో చేరిన రోజే పండగ.. తర్వాత అంతా దండగేనని విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ పాలన దేనికోసం రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.