
మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఓ న్యాయవాది దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వచ్చన ఇద్దరు దుండగులు రాజీవ్ సింగ్ అనే న్యాయవాదిపై కాల్పులు జరిపారు. దీంతో రాజీవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉదంతం అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మార్నింగ్ వాక్‌కి వెళ్లిన రాజీవ్ సింగ్(45) కోసం ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఎదులు చూస్తున్నారు. రాజీవ్ సమీపానికి చేరుకోగానే వారిలో ఒకడు నాటుతుపాకీతో ఆయనపై కాల్పులు జరిపాడు. న్యాయవాది మృతి చెందాడని నిర్ధరించుకున్నాకే నిందితుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఇంకోవ్యక్తి బైక్ స్టార్ట్ చేస్తుండగా అది మొరాయించింది. ఇద్దరూ దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కొందరు వారిని పట్టుకోవడానికి పరిగెత్తారు. నిందితులు వాళ్లకి తుపాకీ చూపించి బెదిరించారు. ఈలోగా బండి స్టార్ట్ అవడంతో వారిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారైనట్టు వీడియోలో ఉంది. ఇదిలాఉండగా రాజీవ్ గతంలోనే తనపై దాడి జరగవచ్చంటూ రక్షణ కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.