
హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు
ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదు
పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు
పభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిల ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్: హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు అని, ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదని, పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని, పొంగులేటి కానీ, ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను హరీష్‌రావు అంటగడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శిల్పా ఇన్పోటెక్ కంపెనీలో పొంగులేటి లేదా ఆయన కొడుకు డైరెక్టర్లుగా లేరని, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్ , క్రిస్టల్ మ్యాన్‌క్షన్‌తో కూడా పొంగులేటికి సంబంధం లేదని వారు తెలిపారు.
హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్ అని, ఆంధ్రా, తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఉద్యమ సమయంలో బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీష్ రావుదని వారు ఆరోపించారు. సొంత మామను బ్లాక్ మెయిల్ చేసి ఇరిగేషన్ మంత్రి అయ్యారని, తమ సీక్రెట్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కవిత కూడా నెమ్మదిగా రూపాంతరం చెందుతోందని, తండ్రిని మళ్లీ మంచి చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. అనేక కంపెనీలను కెటిఆర్, హరీష్‌రావులు బ్లాక్ మెయిల్ చేశారని వారు ఆరోపించారు.
మామ ఫాంహౌస్ నుంచి రాడనీ, బామ్మర్థి ఊర్లో లేడని, కవిత పార్టీలో లేదని, అందుకే హరీష్ రావు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు. 2029 వరకు బిఆర్‌ఎస్‌లోనే ఉంటానని చెప్పే దమ్ము హరీష్ రావుకు ఉందా..? అని వారు ప్రశ్నించారు. 2014 నుంచి 2026 వరకు భూముల కేటాయింపులు, బదలాయింపులపైన విచారణకు ప్రభుత్వం సిద్ధమని వారు పేర్కొన్నారు.