
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు వచ్చి ఇవ్వాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆధారాలు ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలు తీసుకొని వస్తే తాను చర్చకు సిద్ధం అన్నారు. పస లేని ఆరోపణలు చేయొద్దని నాదర్‌గుల్ భూముల కుంభకోణం బిఆర్‌ఎస్ హయంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. తమపై బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బిఆర్‌ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదని హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. తాము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని, అదే బిఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని మహేష్ కుమార్ విమర్శించారు.