
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్‌తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్‌కు పాటుపడవచ్చని పేర్కొన్నారు.
‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్‌కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్‌తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.