
ఈ మధ్యకాలంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ వాడని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ యూట్యూబ్ చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే యూట్యూబ్‌ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్‌టివిలో సుదీర్ఘ అన్‌స్కిప్పబుల్ యాడ్స్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్‌స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. దాని స్థానంలో 90 సెకన్ల పాటు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్‌ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయి. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాంప్రదాయ ప్రకటన దారులను ఆకర్షించడం.. మరోవైపు యాడ్స్ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లిండమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కేవలం స్మార్ట్ టివిలకే పరిమితం చేస్తారా? లేదంటే మొబైల్‌కూ వర్తింపజేస్తారా? చూడాలి మరి.