
అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్‌కి అతడి దేశంలోనే కాదు.. భారత్‌లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్‌లో రషీద్ బౌలింగ్‌ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రషీద్ ఖాన్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోె గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ అద్భుత ప్రదర్శన (3/17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం రషీద్ మాట్లాడుతూ.. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చాడు.
‘‘టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను ఆడాను. గతేడాది జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 67 ఓవర్లు బౌలింగ్ చేశాను. దీంతో ఇది నా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్టులు ఆడే సాహసం చేస్తే.. ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేనని హెచ్చరించారు’’ అని వెల్లడించాడు.
రషీద్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత యుకెలో సర్జరీ చేయించుకొని 2024లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇక అఫ్తానిస్థాన్‌కు 2017లో టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అప్పటినుంచి ఆ జట్టు 12 టెస్టులు ఆడగా.. అందులో రషీద్ 6 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ 6 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.