Reading Time: 2 minutes

అమరావతి: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మీ భూమిపై కన్నేశారని అన్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు ’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొన్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నారని.. ఆస్తి మీది..ఫొటో ఆయనది అని విమర్శించారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని, సెంటు భూమి కోసం కొట్లాడుకుని కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని, చిన్న చిన్న భూతగాదాలు మనకు వద్దు అని అన్నారు. విభేదాలు ఉండే గ్రామాలు గుర్తించండని, మధ్యవర్తిత్వంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతునే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతి పోయిందని మండిపడ్డారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జిలే వచ్చేవని, మీకు భూహక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని తెలియజేశారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని, మీ ముందే సర్వే చేయించి.. రికార్డు చేస్తామని, అన్నారు. ఈకెవైసి తీసుకునే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని, అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని అనేదే తన అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు.

పాస్ పుస్తకం ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకువచ్చానని, భూములు ఎవరూ కొట్టేయకుండా లాక్ సిస్టమ్ తెచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాలని రద్దు చేశామని, 22 ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నానని, భూ రిజిస్టేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకువస్తామని అన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంత అయిందని, వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలపాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.