
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14సార్లు బీఫాం ఇచ్చిందని అన్నారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై మహేష్ గౌడ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు,ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రేవంత్ పోవాలని.. మార్పు రావాలని అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. మాజీ సిఎం కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారని తెలియజేశారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని.. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని, మంత్రులపై విమర్శలు చేసేవాళ్ల ఆధారాలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలని అన్నారు. పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకం కాదని, దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్ట పోతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.