
అత్యధిక వేడి వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం దాపురిస్తాయని గతంలో అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలపైన, పిండంపైన వేడి ప్రభావంపై ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అన్న కోణంలో విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. గర్భధారణ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు గురైతే మగపిల్లల జననం తక్కువగా ఉంటుందని, సబ్ సహరాన్ ఆఫ్రికా, భారత్ దేశాల్లో జనాభాపరంగా, ఆరోగ్యపరంగా జరిగిన సర్వేల్లో వెల్లడైంది. గర్భధారణ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు సహజమైన లింగ నిష్పత్తిలో మార్పు వస్తుందని బయటపడింది. ఈ పరిశోధనలో 90 డెమోగ్రాఫిక్, హెల్త్ సర్వేల నుంచి 5 మిలియన్ జననాల వివరాలు సేకరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కేవలం పర్యావరణానికే పరిమితం కాదని, మానవ జననాలపై కూడా ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక ఉష్ణోగ్రతలు పుట్టబోయే శిశువు అబ్బాయా లేక అమ్మాయా అన్న విషయంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భూతాపం కారణంగా ప్రపంచం లోని కొన్ని ప్రాంతాల్లో జననాల లింగ నిష్పత్తి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిశోధనలో 33 ఆఫ్రికా దేశాలతోపాటు భారతదేశంలో కూడా దాదాపు 50 లక్షల జననాలను అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ మించినప్పుడు మగ శిశువుల జనన రేటు తగ్గి ఆడశిశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశోధన చెబుతోంది. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో గర్భధారణ మొదటి మూడు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే మహిళలు మగబిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. భారత దేశంలో మగపిల్లలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో లింగ ఎంపిక గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
గర్భధారణ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు గురైతే నెలలు నిండక ముందే ప్రసవించడం, తక్కువ బరువుతో శిశుజననం, మృతశిశువు జన్మించడం వంటి అపసవ్యాలు ఏర్పడే పరిస్థితి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.గర్భధారణ సమయంలో ప్రధాన అవయవాలు ఏర్పడు మొదటి త్రైమాసికంలో అధిక వేడికి గురైతే శిశువు పుట్టుకతో కొన్ని లోపాలు కలుగుతాయని, పిండం వేగంగా పెరిగే రెండు లేదా మూడవ త్రైమాసికంలో అత్యధిక వేడిని ఎదుర్కొంటే నెలలు నిండక ముందే ప్రసవించడం లేదా మృత శిశువు జన్మించడం జరగవచ్చని, గర్భధారణ అంతటా వేడికి గురైతే శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సుమారు 3.85 లక్షలమంది గర్భిణులపై 2000 నుంచి 2015 వరకు పరిశోధనలు సాగించారు.గర్భం దాల్చడానికి 12 వారాల నుంచి బిడ్డ పుట్టేవరకు తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేశారు.
ఈ విధంగా పుట్టిన బిడ్డల్లో దాదాపు 20 శాతం మంది బరువులో వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు. ఇక వేసవిలో వీచే వడగాలులు సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తాయని బయటపడింది. వడగాలులు వల్ల కీటకాల్లోనూ, మనుషుల్లోనూ వీర్యం దెబ్బతిన్నట్టు గుర్తించారు. మగవారిలో వీర్య ఉత్పత్తి జరిగేటప్పుడు వారి మర్మావయవాల్లో చల్లదనం ఉండాలని, వడగాలుల వల్ల వేడిపెరగడం ప్రారంభమైతే వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతింటుందని పరిశోధకులు తెలుసుకున్నారు. పురుషుల సంతానోత్పత్తి సామర్ధంపై అధిక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. స్త్రీల సంతానోత్పత్తి సామర్థం కూడా వడగాలులకు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని తేలింది. అండం, ఫలదీకరణ అభివృద్ధి దెబ్బతింటాయి. మహిళల శరీరంలోని హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. క్రమరహిత పిరియడ్స్, అధిక రక్తపాతం, పిరియడ్స్ సమయంలో నొప్పిరావడం వంటి కారణాలు కనిపిస్తాయి.
ఒత్తిడి మరీ ఎక్కువైతే రుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. అందుకే గర్భిణులు వడగాలుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు గురైతే నెలలు నిండకముందే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది. ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే పేదల్లో ఎక్కువ మంది దీని ప్రభావానికి గురవుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కనీసం 15 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండక ముందే ప్రసవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ విధంగా చనిపోయే చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జొహన్నెస్‌బర్గ్ లోని విట్స్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ హెచ్‌ఐవి సంస్థకు చెందిన మాథ్యూ చెర్చిస్ నేతృత్వం లోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం 27 ధనిక, పేద, మధ్య ఆదాయ దేశాలపై 70 అధ్యయనాలు నిర్వహించింది. వాతావరణంలో ఒక డిగ్రీ సెల్సియస్ వేడి పెరిగితే ముందస్తు జననాల రేటు ఐదు శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. వడగాడ్పులు ఎక్కువగా వీచే పరిస్థితుల్లో ఇది 16 శాతానికి పెరిగిందని అధ్యయనంలో తేలిందని పరిశోధకుల బృందం పేర్కొంది.
– డాక్టర్ బి. రామకృష్ణ
– 99599 32323