
భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల పాత్ర విశిష్టమైనది. ముఖ్యంగా దక్షిణ మధ్య భారతదేశంలో, గోదావరి అటవీ ప్రాంతాల్లో నివసించే గోండ్లు, కోయలు వంటి గిరిజన సమూహాలు స్వేచ్ఛా భావనకు ముందుగానే కట్టుబడి, పాలక వ్యవస్థలపై తిరుగుబాటు స్వరాన్ని వినిపించాయి. ఈ నేపథ్యంలో 19వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన రాంజీ గోండ్ తిరుగుబాటు ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తుంది. 1857 స్వాతంత్య్ర సమరంతో సమకాలీనంగా, హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభావం, నిజాం పాలనకు వ్యతిరేకంగా గిరిజన- రోహిల్లా కూటమి రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి రాంజీ గోండ్ నాయకత్వం వహించడం గిరిజన చైతన్యానికి ప్రతీకగా భావించవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వద్ద, రాంజీ గోండ్ నాయకత్వంలో గోండ్లు రోహిల్లాలకి చేరారు. 1860 ఏప్రిల్ 9న నిర్మల్‌కు కొన్ని మైళ్ళ దూరంలో సమీకృతమైన రోహిల్లాలు, గోండు, డెక్కనీల గుంపుపై నిర్మల్ కలెక్టర్ చేసిన దాడికి సంబంధించిన వివరాలు హైదరాబాద్ సెంట్రల్ రికార్డ్ ఆఫీస్ (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్)లో భద్రపరచిన ఫైళ్లలోని పత్ర వ్యవహారాల ఆధారంగా సేకరించబడ్డాయి. ఈ ఆధారాల ప్రకారం ఏప్రిల్ 1, 1860 ఆదివారం నాడు రాంజీ గోండ్ సిపాయిలు, నిజాం / బ్రిటిష్ ప్రభుత్వ దళాలకు మధ్య భీకర పోరాటం జరిగింది. అందులో ఇరువర్గాల వారికి ప్రాణనష్టం జరిగినా రాంజీ గోండ్ తప్పించుకున్నాడు.
తరువాత ఆయనను 1860 సెప్టెంబర్ ప్రాంతంలో పట్టుకుని నిర్మల్ లోని మర్రి చెట్టుకు ఉరి తీశారు. ఇది ఆధార సహిత చరిత్ర. కాగా కొందరు ఏప్రిల్ 9 నే అయన వర్ధంతి అని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యం తెలియాలన్న ఉద్దేశంతో ఈ వ్యాసంలో సంబంధిత ఆధారాలు ఇవ్వడమైనది. (1) 1860 ఏప్రిల్ 9 తేదీ గల లేఖ సంఖ్య 155లో హాజీ అలీ, ఇతర రోహిల్లాలపై జరిగిన దాడికి సంబంధించిన విపుల వివరాలు ఇవ్వబడ్డాయి. ఇంకా వివరాలు ఇలా ఉన్నాయి: గత ఆదివారం ఉదయం 4 గంటల తర్వాత కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. -రాంజీ, ఇతర తిరుగుబాటుదారులు నిర్మల్ నుండి 15 కురోహ్ దూరంలో, రహదారి నుండి 4 కురోహ్ దూరంలో ఉన్న ఒక కొండ సమీపంలో ఆశ్రయం పొందారని. శత్రువులు తలదాచుకున్న ప్రదేశం చాలా దుర్భేద్యమైనది. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన కూడా వెళ్లలేని విధంగా మార్గం సన్నగా ఉండేది; అక్కడ ఆహారం, నీరు వంటి అవసరాలు కూడా లభించేవి కావు. విశ్వాసభావంతో కలెక్టర్ తన వద్ద ఉన్న దళంతో అక్కడికి బయలుదేరాడు.
అనేక కష్టాలను భరించి మధ్యాహ్నం సమయానికి శత్రువుల వద్దకు చేరుకుని దాడి చేశాడు. మొదట కొంతసేపు తుపాకీ కాల్పులు జరిగాయి; ఆ తరువాత కత్తులతో పోరాటం జరిగింది. శత్రు పక్షంలో ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా తెలియలేదు.తిరుగుబాటుదారులు సుమారు 200 రోహిల్లాలు, 300 గోండ్లు, డెక్కనీలు ఉండేవారు. గాయపడిన అనేక మంది తిరుగుబాటుదారులు పారిపోయారు. దళసభ్యులు చాలా అలసటతో, ఆకలితో ఉండటం వల్ల పారిపోయిన తిరుగుబాటుదారులను వెంబడించలేదు. వారు 4.30 గంటల్లో 20 కురోహ్ దూరం ఆకలితోనే ప్రయాణించారు. వారికి ఆహారం కొరత కూడా ఉంది. దళసభ్యులు ఆకలి, దాహంతో అలమటిస్తూ చీకటి పడడంతో ఆహారం, నీటి కోసం ముందుకు కదిలారు. ఉత్త్నూర్ తాలూకాలోని బాలాపూర్ ఎడారిలో రెండు కురోహ్ దూరం నడిచిన తరువాత మాత్రమే వారికి నీరు దొరికింది. ఈలోగా తిరుగుబాటుదారులు అవకాశాన్ని వినియోగించుకుని పారిపోయారు. చిన్నూర్ థానేదార్ ఫతేహ్ అలీ ఖాన్‌ను ఎడ్లాబాద్ థానేదార్‌కు సహాయం చేయడానికి పంపించారు; అయితే యుద్ధ సమయంలో అతడు అతనిని కలవలేదు.
అయినప్పటికీ ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకుని వారిని వెంబడించి పట్టుకుంటానని హామీ ఇచ్చాడు. దేవుని దయతో తిరుగుబాటుదారులు పట్టుబడి శిక్షించబడతారు. (2) నిర్మల్ తాలూకాదార్, నాగపూర్ నుండి సహాయం పొందుతున్నట్టు తెలిసిన సుమారు వెయ్యిమంది రోహిల్లాలు, గోండ్లపై జరిగిన దాడి గురించి దివాన్‌కు సమాచారం ఇచ్చాడు. రహదారులు దుర్గమంగా ఉండటంతో సైన్యం అనేక కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. అవసరమైన సామగ్రి కొరతతో వారు లభ్యమైన కొద్దిపాటి వనరులతోనే జీవించాల్సి వచ్చింది. అయినప్పటికీ శత్రువులతో పోరాడటంలో ఎలాంటి వెనుకడుగు వేయలేదు. మొదట రెండు పక్షాల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి; తరువాత అది కత్తిపోట్ల యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో రెండు పక్షాలకు నష్టాలు సంభవించాయి. అయితే సైన్యం తిరుగుబాటుదారులను చుట్టుముట్టడంలో విజయం సాధించింది; కానీ వారి నాయకుడు రాంజీ మాత్రం తప్పించుకున్నాడు.
ఈ ఘటన వివరాలు రెసిడెంట్‌కు తెలియజేయబడ్డాయి. అతను తన సమాధానంలో తాలూకాదార్ సేవలను ప్రశంసిస్తూ రాంజీని తప్పకుండా పట్టుకోవాలని ఆదేశించాడు. అయితే ఫైల్లో రాంజీ పట్టుబడిన విషయంపై సమాచారం లేదు. తరువాత రాంజీ గోండ్ పట్టుబడి, విచారణకు గురై, నిర్మల్‌లో ఉరిశిక్ష అమలు చేయబడ్డాడు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని తిరుగుబాటు అణచివేయబడింది. 1860 నాటికి రోహిల్లాల తిరుగుబాట్లు ముగిశాయి; అనేక రోహిల్లాలు పట్టుబడి, విచారణ అనంతరం వివిధ కాలాలపాటు జైలు శిక్షలకు గురయ్యారు. పై వివరాలు అన్నీ హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర సంకలనానికి నియమించబడిన కమిటీ 1956 నాటి ప్రచురణ, ‘ది ఫ్రీడమ్ స్ట్రగ్గుల్ ఇన్ హైదరాబాద్’, రెండవ సంపుటం (1857- 1885), పుటలు 155 -157 లలో ఉన్నాయి. రాంజీ గోండ్ మరణ సూచన 1860 అక్టోబర్ 15 నాటి రిపోర్ట్ లో ఉంది. ఆనాడు రిపోర్ట్ లండన్‌కు వెళ్లి ప్రచురించబడడానికి సుమారు నెల పట్టేది. కాబట్టి రాంజీ గోండ్ వర్ధంతిని సెప్టెంబర్ 17 న జరుపుకోవలసి ఉంటుంది.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ
– 94909 57078