Reading Time: 4 minutes

దేశంలో, రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌగోళిక సరిహద్దుల ఖరారుకు జరపాల్సిన పునర్విభజన వివాదాస్పదమవుతోంది. ఈ ప్రక్రియతో చట్టసభల్లో తమకు లభించే ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది అసమంజసం, అన్యాయమని దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచినా, ఇప్పుడున్న స్థానాలపై సగటున 50 శాతం సీట్లు పెంచినా తమకు అన్యాయమే అన్నది వారి వాదన! ఈ ప్రాతినిధ్య వ్యత్యాసాల వల్ల అధికార కేంద్రీకరణ దక్షిణాది నుంచి ఉత్తరాదికి మారుతుందని, నిర్ణయాధికారంలో దక్షిణ రాష్ట్రాల పాత్ర-ప్రమేయం తగ్గిపోతుందన్నది ఈ ఆందోళనకు కారణం. చట్టసభల్లో ప్రాతినిధ్య వాటా మాత్రమే కాకుండా వేర్వేరు వేదికలపై స్వరం, పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపులు… ఇలా అన్నీ తగ్గిపోతాయనే భయాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ లక్ష్యాలకు అనుగుణంగా బాగా జరిగింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో అది సరిగ్గా జరుగక జనాభా అసాధారణంగా పెరిగింది. ప్రస్తుత పెంపు వల్ల.. సదుద్దేశంతో జనాభాను నియంత్రించిన తమకు శిక్ష, నియంత్రణ చేయక విచ్చలవిడి జనాభా వృద్ధికి కారణమైన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు బహుమతి ఇచ్చినట్టుగా ఉంటుందని వారంటున్నారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు), చంద్రబాబునాయుడు (ఎపి), రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్దరామయ్య (కర్ణాటక), పినరయ్ విజయన్ (కేరళం) కేంద్రం తాజా ఆలోచనల్ని ఖండించి, తీవ్రంగా నిరసించారు. ఒక పౌరుడు, ఒక ఓటు, ఒకే విలువ ఉండాలన్నది ఆదర్శం. ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా పౌరులందరి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ జనాభా -చట్టసభ స్థానాల నిష్పత్తిని ఎప్పటికప్పుడు సమం చేయడం ద్వారా ఇది సాధించేట్టు విధానం రూపొందించారు. ప్రతి పదేళ్లకొకసారి జనాభా గణన, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ముందు నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించడం, తర్వాత దాని ప్రకారం భౌగోళిక సరిహద్దులు సర్దుబాటు/ ఖరారు చేస్తూ వచ్చారు. ఇందుకు రాజ్యాంగ నిబంధనల మేర, చట్టం ద్వారా ప్రతి పదేళ్లకోసారి పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి.

తొలి కమిషన్ 1952లో ఏర్పాటయింది. అప్పుడు దేశంలో 494 లోక్‌సభ స్థానాలే ఉన్నాయి. తర్వాత మూడుమార్లు (1962, 1972, 2002) పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య 1962లో 522 కు, 1972లో 543 కు పెరిగాయి. 1972 తర్వాత ఒక చర్చ వచ్చింది. అప్పట్లో జనాభా నియంత్రణను దేశ ప్రయోజన కార్యక్రమంగా పెద్ద ఎత్తున చేపట్టారు. పెరిగే జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంచితే అది జనాభా నియంత్రణ లక్ష్యాలకు ప్రతిబంధకంగాను, మంచి కార్యం నెరవేర్చేవారికి శిక్షగా, విఫలమయ్యే వారికి బహుమతిగా ఉంటుందనే వాదన తెరపైకి వచ్చింది. చర్చ తర్వాతి అభిప్రాయం మేరకు, ప్రతి పదేళ్లకు తాజా జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినా, 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా (543 కే) కట్టడి చేసేట్టు (42 వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా) నిర్ణయించారు. 2001 లో ఏర్పడ్డ తాజా పునర్విభజన కమిషన్ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నా, మళ్లీ అదే చర్చ తెరపైకి వచ్చింది. మొత్తం నియోజకవర్గాల సంఖ్య (543ను) పెంచకుండానే, 2026 వరకు ఆ సంఖ్యను తిరిగి కట్టడి (84వ రాజ్యాంగ సవరణ 2001) చేశారు. 2001 జనాభా గణాంకాల ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక స్వరూపాల్ని ఏకరీతికి సరిదిద్దే పునర్విభజనను 2009లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. దాంతో సంఖ్య మారలేదు. నాటి ప్రతిపాదన ప్రకారం 2026 తర్వాతి తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌతిక సరిహద్దుల మార్పు చేయాల్సి ఉంది. అందుకే తాజా ఆలోచనలు.

నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్లను ఎందుకు ముడిపెట్టినట్టు? ఇదొక వ్యూహం. దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 సార్వత్రిక ఎన్నికల ముందు 2023 లో హడావుడిగా తీసుకువచ్చారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ వర్తిస్తుందా? అంటే, లేదు 2029 కూడా కష్టమే అనే భావన వచ్చి, అమలు ఇక 2034 ఎన్నికల్లోనే అనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. 2026 తర్వాతి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలి, ఈ రెండు జరిగాకే మహిళా రిజర్వేషన్ల అమలు అని చట్టంలో ఉంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ వల్ల జరుగలేదు. 2025 అనుకున్నా మొదలు కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం మే కు గాని గణాంకాలు అందుబాటులోకి రావు. అప్పుడు పునర్విభజన కమిషన్ ఏర్పరచి, భౌగోళిక సరిహద్దుల ఖరారు ప్రక్రియ చేపట్టినా 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు దుస్సాధ్యమే! 2026 తర్వాతి తాజా లెక్కలు, వాటి ఆధారంగా జరిపే పునర్విభజన అన్న నిబంధనని తొలగిస్తూ చట్ట సవరణ ఇపుడు ఎన్‌డిఎ ప్రభుత్వం ముందున్న లక్ష్యం! జనాభా ఆధారంగా సంఖ్య పెంపును దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కనుక, లోక్‌సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం పెంచాలనేది తాజా ప్రతిపాదన. 543 లోక్‌సభ సీట్లు కాస్త 816 అవుతాయి. అదే లెక్కన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలూ పెరుగుతాయి.

నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల ఖరారుకు, ఎస్‌సి, ఎస్‌టి స్థానాలతో పాటు మూడో వంతు మహిళా రిజర్వుడు స్థానాల గుర్తింపునకు 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రతిపాదించవచ్చు. 50 శాతం స్థానాల పెంపుతో మూడో వంతు సీట్లు పెరుగుతాయి కనుక మహిళా రిజర్వేషన్ అమలుకు అభ్యంతరాలుండవనేది వారి అంచనా. ఈ మేర రాజ్యాంగ సవరణకు సభల్లో మూడింట రెండొంతుల బలం కావాలి. విపక్షాల సహకారం లేకుండా సవరణ సాధ్యపడదు. విపక్షం సహకరించకుంటే… మహిళల రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్నారని ఇరుకున పెట్టొచ్చనేది పాలకపక్ష వ్యూహం. నియోజకవర్గాల సంఖ్య పెంపు జనాభా ప్రాతిపదికన జరిగినా, ప్రస్తుత సంఖ్య మీద 50 శాతం పెంచినా ఉత్తర- దక్షిణ వ్యత్యాసాన్ని అది పెంచుతుందే తప్ప తగ్గించదు. 50 శాతం పెంపు వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నా… దక్షిణాది ముఖ్యమంత్రులు అంగీకరించడం లేదు. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్ 80 స్థానాలు 120 అయితే, కర్ణాటకలో 28 కాస్త 42 అవుతుంది.

అంటే, ఇది వరకు 52 ఉన్న వ్యత్యాసం 78కి చేరుతుంది. ఇది మరింత అన్యాయమే తప్ప పరిష్కారం కాదనేది వాదన. జనాభా ప్రకారమో, 50 శాతం సీట్ల పెంపో కాకుండా దీనికి మరేదో ప్రత్యామ్నాయం కావాలి. సంఖ్య పెంచకుండా కాలాన్ని ముందుకు నెట్టిన 1972 నాటి, 2002 నాటి పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి. జనాభా నియంతణ్ర -వృద్ధి పరమైన ఉత్తర- దక్షిణాల వ్యత్యాసాలు ఇప్పుడింకా అధిక రెట్లలో ఉన్నాయి. సంఖ్య పెంపును మరో పదేళ్లకో, ఇరవయేళ్లకో వాయిదా వేసి, పాత సంఖ్య (543)కే తాజా జనాభా గణాంకాల ప్రాతిపదికన భౌగోళిక స్వరూపాల పునర్విభజన చేపట్టాలనే సూచన వస్తోంది. అమెరికాలో ప్రతినిధుల సభ (మన లోక్‌సభ లాంటి) సభ్యుల సంఖ్యను 1913 లోనే 435 గా కట్టడి చేశారు. ఇప్పుడూ అదే సంఖ్య! 1911లో 9.4 కోట్లున్న అమెరికా జనాభా 2023లో 33.4 కోట్లకు చేరింది. మొత్తం సీట్ల సంఖ్య మార్చకుండానే, జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల్ని ఏకరీతికి తెచ్చినపుడు 37 రాష్ట్రాలు మాత్రం స్వల్పంగా సంఖ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయి.

మన దగ్గర కూడా, స్థానాల సంఖ్య మార్చకుండా రాష్ట్రం యూనిట్‌గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల్ని మార్చాలనే సూచన వస్తోంది. అప్పుడు, జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో తక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటే, నియంత్రించని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటారు. 1973 నుంచి 2026 వరకున్న ఈ వ్యత్యాసాలు ఇక ముందూ ఉంటే ప్రమాదమేంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. యురోపియన్ యూనియన్ (ఇయు)లో ఇదే పరిస్థితి! ఇయు పార్లమెంట్ లోని 720 స్థానాలు 27 మంది సభ్య దేశాల మధ్య పంపిణీ అవుతాయి. డెన్మార్క్‌లోని 60 లక్షల జనాభాకు 15 (సగటున 4 లక్షల మందికి ఒక ప్రతినిధి) మంది సభ్యులుంటే, జర్మనీ 8.3 కోట్ల జనాభాకు 96 (సగటున 8.6 లక్షల మందికి ఒక ప్రతినిధి) సభ్యులున్నారు. లోక్‌సభ స్థానాల సంఖ్య స్థిరంగా ఉంచి, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు పెంచుతూ మరో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చనే సూచనా ఉంది. ఏం చేసైనా తాజా వివాదాన్ని పరిష్కరించడం కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం.

– దిలీప్ రెడ్డి ( సమకాలీనం)

– రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ