Reading Time: 2 minutes

కేరళ, అసోం రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లోనూ గురువారం (ఏప్రిల్ 9) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పుదుచ్చేరి ఎన్నికల గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందేమీ లేదు. కేరళ, అసోంల్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత బలమైన అంశంగా పనిచేయదని తెలుస్తోంది. కేరళలో సిపిఎం నేతృత్వం లోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతోను, కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)తోనూ గట్టిగా పోరాడుతోంది. ఈ రెండు ఫ్రంట్‌లకు చెందిన సభ్యులంతా జాతీయ స్థాయిలో సంయుక్త వ్యతిరేక వేదికలో భాగస్వాములే అయినప్పటికీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఒకరితో ఒకరు నువ్వానేనా అనే రీతిలో ఢీకొంటున్నారు. బిజెపి విషయానికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఆ పార్టీ ఇంకా నిరూపించుకోవలసి ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని లక్షంగా పెట్టుకుంది. 2021లో కేరళ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఎల్‌డిఎఫ్ కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి రెండోసారి అధికారం లోకి వచ్చింది.

ఇప్పుడు మూడోసారి కూడా విజయం సాధించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాలన్న పట్టుదలతో ఉంది. గత పదేళ్లలో లైఫ్ మిషన్, సామాజిక భద్రత పెన్షన్లు, అత్యంత పేదరిక నిర్మూలన, విద్య, వైద్య రంగాల్లో మార్పు, కూలీలకు కనీస వేతనం వంటి పథకాలు అమలు చేశామని, అవే తమను గెలిపిస్తాయని ఎల్‌డిఎఫ్ విస్తృతంగా ప్రచారం చేసింది. లైఫ్ మిషన్ పథకం కింద ఐదు లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించి పంపిణీ చేసింది. పేదరిక నిర్మూలన పథకం కింద దాదాపు 64,000 కుటుంబాలకు విముక్తి కలిగించింది. వ్యక్తిగత విమర్శల కంటే ‘ప్రదర్శన ఆధారిత రాజకీయాల’ పై ఎల్‌డిఎఫ్ దృష్టి సారించింది. అయితే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, పెన్షన్ల పంపిణీలో జాప్యం వంటివి విపక్షాల విమర్శలకు దారితీశాయి. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీకి ఈసారి అనుకోని ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అనుభవజ్ఞులైన, కీలకమైన సీనియర్ నేతలు ఐదుగురు పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ మద్దతు గల యుడిఎఫ్ ఇండిపెండెంట్లుగా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగం లోకి దిగారు.

వీరిలో కొంతమంది 1967 నుంచి సిపిఎంకు కంచుకోట వంటి పయన్నూర్ వంటి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కేరళలో ఈ మూడు కూటములు బయటకు తీవ్రంగా పోరాడుతున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం పరస్పర ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఓటర్లలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) విషయం పరిశీలిస్తే 2025 నాటి లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్న ఆకాంక్షతో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. మలప్పురం వంటి బలమైన స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం కంటే ముస్లిం లీగ్ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. 2021 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత యుడిఎఫ్ కొత్త వారికి, యువకులకు అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. తెలంగాణలో విజయవంతమైన హామీల నమూనాను కేరళలో అమలు చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

విద్యార్థులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఆరు గ్యారంటీలను ప్రకటించింది. చిన్న వ్యాపారుల కోసం రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రబ్బరు రైతులకు ప్రత్యేక మద్దతు ధర కిలోకు రూ. 250 వంతున కల్పన వంటి హామీలు ఇందులో ఉన్నాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి పరిశీలిస్తే ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రెండోసారి తానే ముఖ్యమంత్రిగా రావాలని, ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి విజయం సాధించాలన్న ఆశతో ఉన్నారు. శర్మ హిందుత్వ వాదాన్ని బలపరుస్తూ ముస్లిం వ్యతిరేక వాదన తీవ్ర రూపంగా మారుస్తున్నారు. అంతేకాదు ద్వేష ప్రసంగాలు చేయడంలో ఆయన ఆరితేరారు. 2018 నాటి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనపై 40 కేసులు నమోదై ఉన్నాయని తేలింది. వీటిలో చాలా కేసులు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవే. ఇక్కడ ముస్లిం చొరబాటుదారుల ఏరివేత. అభివృద్ధి ప్రాజెక్టులు, హిందుత్వ అతివాదం ఇవే ప్రధాన లక్షాలుగా బిజెపి పనిచేస్తోంది. గోహింస, లవ్ జీహాద్, మతమార్పిడి వంటివి ప్రధాన సమస్యలుగా పేర్కొంటోంది.

సంక్షేమ పథకాలకు సంబంధించి అరుణోదయ పథకం కింద 40 లక్షల మందికి నేరుగా నెలకు రూ. 1250 వంతున ఆర్థికసాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి చొరబాటుదార్లను తరిమికొట్టడం, అక్రమ ఆక్రమణలను నివారించడం తప్పనిసరి అంటున్నారు. ఇక కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని సిఎం తీవ్ర ఆరోపణలు చేయగా, దీనికి ప్రతిగా గొగోయ్ సిఎం శర్మ భార్యకు యుఎఇ, ఈజిప్టు, బర్బూర్ తదితర మూడు దేశాల పాస్ పోర్టులున్నాయని, ఓడిపోతే విదేశాలకు పారిపోడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం 2021 నుంచి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు కేవలం 30 మాత్రమే ఉన్నప్పటికీ పార్టీల రాజకీయాల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట, ప్రజలతో మమేకం కావడం, సామాజిక సంబంధాలు తదితర అంశాలే విజయానికి కారణాలవుతాయి.