Reading Time: < 1 minute

గౌహటి: క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పుకోవాలి. 13 ఏళ్లకే గత ఐపిఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున గత ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో కూడా సంచలనాలు సృష్టించాడు. ఇక ఈ సీజన్‌లోనూ వైభవ్ అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మొదటి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ విషయంపై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్పందించాడు. బుమ్రాను వైభవ్ ఎదురుకున్న తీరు.. తమ జట్టులోని మిగితా బ్యాటర్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపిందని జైస్వాల్ అన్నాడు. ‘‘బుమ్రా తొలి బంతికే వైభవ్ సిక్సర్ బాదాడు. ఇలాగే నీవైన షాట్లు ఆడుతూ ఉండు అని అతడికి చెప్పాను. బుమ్రా దిగ్గజ బౌలర్లలో ఒకడు. అలాంటి బౌలర్ బంతులను వైభవ్ ఎదురుకున్న తీరు గొప్పగా అనిపించింది. మనం కూడా బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు అనే విశ్వాసాన్ని మిగితా బ్యాటర్లకు అతను ఇచ్చాడు. నా మీద కూడా అతడు ఒత్తిడిని తొలగించాడు. మా భాగస్వామ్యాన్ని ఎంతో ఆస్వాదించాను’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.