
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వాన్ని, మంత్రులను భ యబ్రాంతులను గురిచూస్తే వారి తాటాకు చప్పుళ్ల కు భయపడమని, ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తే తాము భయపడమని రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నాయకుల అక్రమాలు, భూదందాల చిట్టాను త్వరలోనే విప్పుతామని బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాల జాబితాను ఒక్కొక్కటి గా తమ మిత్రలు ఇస్తున్నారని వాటిని త్వరలోనే బ యటకు తీస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నాదర్‌గుల్, వట్టినాగులపల్లి భూముల వ్య వహారం , మంత్రులపై బిఆర్‌ఎస్ నాయకులు చేసి న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధి స్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా మంత్రి పొంగులేటి అభివర్ణించారు. బుధవారం ఆ యన సచివాలయంలో గ్రౌండ్‌ప్లోర్‌లో జరిగిన విలేకరుల
సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పది సంవత్సరాల్లో తెలంగాణను కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని బిఆర్‌ఎస్ నాయకులైన అబద్ధాల రావు, డ్రామారావు, శకుని మామలు ఎలా తాపత్రయ పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ధరణిలో జరిగిన అవకతవకలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయని, ఫోరెన్సిక్ ఆడిట్ లో రెండు జిల్లాల రిపోర్టు వచ్చిందని, మిగతా జిల్లాలది రాబోతుందని ఆయన తెలిపారు. అవన్నీ బయట పెట్టక ముందే, మనకంటిన బురద వారికి పూస్తే ఇద్దరం బురద రాసుకున్నోళ్లం అవుతామని బిఆర్‌ఎస్ పగటి కలలు కంటుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తరువాత డ్రామారావు, అబద్ధాల రావు, శకుని మామ కుటుంబానికి ఉన్న ఆస్తులెంతా? ఇప్పుడు వారికున్న ఆస్తులెంత చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని…
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్లు మీరని, ప్రజలకు ఈ విషయం తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసనీ ఆయన అన్నారు. అంతేకాదు మాయమాటలు చెప్పి, తడి బట్టతో నా గొంతు కోసిన తరువాత, నీ పార్టీకి ఇదే రాఘవ కన్‌స్ట్రక్షన్ నుంచి అధికారికంగా కోటి రూపాయలు ఇచ్చానని మరచిపోయావా అబద్ధాలరావు అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా డ్రామారావు? మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని ఈస్టోరీ మీ అంతరాత్మకు తెలుసనీ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు, మీకు చాలెంజ్ విసిరారు.
ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్‌కు రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం లేదని, రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సిబిసిఐడీ విచారణ వేస్తామని సిఎం పేర్కొన్న విషయాన్ని మరోసారి మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ఆ కంపెనీతో పాటు విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సిబిసిఐడీ విచారణ జరిపిస్తామని పేర్కొనడం తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపిస్తుందని ఆయన అన్నారు. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో గనుల శాఖకు అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామలే మంత్రులుగా వ్యవహారించారని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో మైనింగ్‌ను దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడీ ద్వారా విచారణలో వస్తుందని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోనే నాదర్‌గుల్ భూములకు మ్యుటేషన్….
నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
వట్టినాగులపల్లి భూములపై అబద్దాలరావుది దుష్ప్రచారం….
వట్టినాగులపల్లి భూముల్లోనూ అబద్దాలరావుది పూర్తిగా దుష్ప్రచారమని మంత్రి పొంగులేటి కొట్టిపారేశారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షా కుటుంబానికి సంబంధించిన భూమిని తన కుమారుడు సహా నలుగురు డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారని, వట్టినాగులపల్లి భూములను తన కుమారుడు కొనలేదని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హోమ్ అనే సంస్థ కొన్న భూమి కొంత ఓఆర్‌ఆర్‌లో పోయిందని, ఓఆర్‌ఆర్‌లో పోయిన కొంత భూమిని రికార్డుల నుంచి తొలగించుకోలేదని మంత్రి తెలిపారు. ఓఆర్‌ఆర్‌లో పోయినంత భూమిని పక్కవాళ్ల భూమి నుంచి కబ్జా చేసే ప్రయత్నం చేశారని, ఆనాడు ప్రభుత్వం అండతో హోం సంస్థ భూఅక్రమాలకు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని…
ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వంపై మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని, సన్నబియ్యం పథకంపై ప్రజల స్పందన చూసి దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బిఆర్‌ఎస్ ఉనికి పోతుందని మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని, పౌర సరఫరాలో అవినీతి అంటూ మంత్రి ఉత్తమ్‌పై మరో పుకారు పుట్టించారని ఆయన అన్నారు. లిక్కర్ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మీద కూడా అదే రకంగా నిందలు వేశారని ఆయన మండిపడ్డారు. హిల్ట్ పాలసీ, మైనింగ్ పై విచారణకు సిద్ధమని సిఎం రేవంత్ చెబితే అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్లిందెవరు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.