Reading Time: 2 minutes

ఇరాన్‌తో కాల్పుల విరమణ అనంతరం కొత్త దశ చర్చల్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న పట్టుదలతో అమెరికా ముందుకు వెళ్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో టారిఫ్ తగ్గింపులు, ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందం విసృ్తత పరిధిలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలు అంగీకారానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో, ఇరాన్‌లో యురేనియం శుద్ధి పూర్తిగా నిలిచిపోతుంది. అమెరికా, ఇరాన్‌తో కలిసి లోతుగా దాచిన అణు మౌలిక సదుపాయాల అవశేషాలను వెలికితీసి తొలగిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయని, దాడి జరిగినప్పటి నుంచి వాటిలో మార్పులేమీ లేవని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇరాన్‌తో ఆర్థిక చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని ట్రంప్ సూచించారు. టారిఫ్‌లు తగ్గించడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 15 అంశాల్లో చాలా వరకు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి అని పేర్కొన్నప్పటికీ, వాటి వివరాలు వెల్లడించలేదు. అలాగే, ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికాకు ఎగుమతులపై వెంటనే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయానికి ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేశారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం చివరి క్షణంలో సాధ్యమైంది. అయితే దీని అమలు, షరతులపై ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో క్షిపణి హెచ్చరికలు నమోదయ్యాయి. ఇరాన్‌లో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా సమాచారం వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. లెబనాన్‌లోని హెజ్బొల్లాపై యుద్ధం కూడా ఒప్పందంలో భాగమా అనే విషయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయి.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై ఫీజులు విధించే విధానాన్ని ఇరాన్ అమలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఒమాన్‌తో కలిసి ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మార్గంలో రాకపోకలు ఇరాన్ సైన్య పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. అయితే గల్ఫ్ దేశాలు దీనికి వ్యతిరేకంగా నిలిచే అవకాశముంది.

ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇరాన్ గతంలో యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసింది, ఇది ఆయుధ స్థాయి శుద్ధికి దగ్గరగా ఉంటుంది. అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలో ఫార్సీ, ఇంగ్లీష్ పత్రాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. ఫార్సీ వెర్షన్‌లో శుద్ధి కొనసాగుతుందని సూచనలు ఉండగా, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా కొట్టిపారేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఇంకా వెలుగులోకి రాలేదు.

యుద్ధం ముగియాలంటే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, ఆంక్షలు ఎత్తివేయడం, నిల్వ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి అమెరికాకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టెహ్రాన్‌లో కాల్పుల విరమణ అనంతరం ప్రభుత్వ అనుకూల నిరసనలు కొనసాగడం, అమెరికాఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు వినిపించడం, దేశంలో కఠిన వైఖరి ఇంకా కొనసాగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత ఒప్పందంపై చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.