Reading Time: < 1 minute

బిఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వనపర్తి సభకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా ఎస్పి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం నియోజకవర్గంలో హరీశ్ రావు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు హరీశ్ రావు వనపర్తి పర్యటనకు సిద్దమయ్యారు. దీని కోసం ముందుగా అనుమతులు తీసుకున్నప్పటికీ,

చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ జిల్లా ఎస్పి అనుమతులను రద్దు చేశారు. ఈ క్రమంలో అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ హరీష్ రావు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పోలీసుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో హరీష్ రావు వనపర్తి సభకు మార్గం సుగమమయ్యింది.