
న్యూఢిల్లీ: ఏఐఏడీఎంకే ‘రెండు ఆకులు’ ఎన్నికల గుర్తుకు సంబంధించిన కుంభకోణం ఆరోపణల కేసులో, అనేక మందిని మోసం చేసిన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, సుకేష్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, చంద్రశేఖర్ జైలులోనే కొనసాగుతారు. వివిధ న్యాయ పరిధులలో అతనిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 కేసులలో అతనికి బెయిల్ లభించగా, ఐదు కేసులు ఇంకా అతనిపై పెండింగ్‌లో ఉన్నాయి.
కాగా, పార్టీ ఎన్నికల గుర్తు కేటాయింపును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, అలాగే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పీఎంఎల్‌ఏ కేసు నమోదైంది. ఏఐఏడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారని, వీకే శశికళ నేతృత్వంలోని వర్గం పార్టీకి రెండు ఆకుల గుర్తును కేటాయించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి.