
హైదరాబాద్: ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ఆర్‌ఆర్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ, ఎంఐ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరు పైచేయి సాధిస్తారు అనే ఇవాళ తేలనుంది. ఈ సందర్భంగా ముంబయి బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మీడియాతో మాట్లాడారు. వైభవ్ సూర్య వంశీ విషయంలో తాము ఆందోళన చెందడం లేదని, ఇతర ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు వేస్తున్నామో వైభవ్ విషయంలో అదే విధంగా వ్యవహరిస్తామన్నారు. ఆర్‌ఆర్‌లో అతడు విలువైన ఆటగాడు అని, అందులో సందేహం ఏమీ లేదన్నారు. అతి చిన్న వయస్సులో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడారు. రవి బిష్ణోయ్ గురించి ఎటువంటి భయం లేదని, బిష్ణోయ్ మిస్టరీ స్పిన్నర్ కాదు అని, కొన్ని సంవత్సరాల నుంచి అతడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడో చూస్తున్నామని, ఇప్పుడు అదే విధంగా వేస్తున్నాడని పరాస్ పేర్కొన్నారు. మైదానంలో ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియదన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్‌ఆర్ రెండు మ్యాచ్‌లు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా ముంబయి రెండు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ గెలిచి ఆరో స్థానంలో ఉంది. చెన్నైపై వైభవ్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.