Reading Time: < 1 minute

గురువారం నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి తొలుత పింక్ రంగులో ఉండగా.. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారిపోయింది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల జెర్సీ రంగు వల్లే ఈ మార్పు జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బంతి షైన్ అవ్వడానికి ఆటగాళ్లు దాన్ని రుద్దుతారు. అందువల్లే జెర్సీ రంగు అంటుకొని బంతి రంగు మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెర్సీలు నాసిరకం కావడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. దీంతో పాక్ క్రికెట్ పరువు పోయింది.

ఆట మధ్యలో బంతి ఇలా రంగు మారడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ అంపైర్‌కి ఫిర్యాదు చేశాడు. ‘‘రెండో ఓవర్ తర్వాత నేను అంపైర్‌తో ఈ విషయంపై మాట్లాడాను. బంతి ఎరుపెక్కింది. అసలు అక్కడ ఏం జరిగింది? కచ్చితంగా దుస్తుల వల్లే జరిగి ఉంటుంది. నేను ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనను చూడలేదు’’ అని లబుషేన్ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు.

‘బ్యాట్ రంగు కాస్త బంతికి అంటుకోవడం, బ్యాట్ ప్యాడ్‌కు తగిలి దానిపై ఉన్న రంగు కొద్దిగా ఊడిపోవడం వంటి సందర్భాలు నేను చూశాను. కానీ దుస్తుల విషయంలో ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. రాబోయే మ్యాచుల్లో దీన్ని సరిచేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని లబుషేన్ అన్నాడు.