
ఉద్యోగుల భవిష్యత్ భద్రతను పెంచేందుకు.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)లో తప్పనిసరిగా చేరటానికి సంబంధించిన వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇక దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత అమలులోకి వచ్చే తేదీని ప్రకటించనుంది మోడీ సర్కార్.
ప్రస్తుతం నెలకు రూ.15వేల వరకు బేసిక్ శాలరీ పొందే ఉద్యోగులు మాత్రమే EPF, EPS పథకాల్లో తప్పనిసరిగా చేరాల్సి ఉంది. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే రూ.15వేల నుంచి రూ.25వేల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా ఈ పథకాల్లో చేరాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సేవింగ్స్, పెన్షన్ భద్రత అందుతుంది.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు భవిష్యత్ అవసరాల కోసం ఎక్కువ సేవింగ్స్ క్రియేట్ అవుతాయి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా పెరగడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పటివరకు ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులకు EPFలో చేరడం తప్పనిసరి కాకపోవడంతో.. చాలా మంది ఈ ప్రయోజనానికి దూరంగా ఉన్నారు.
అలాగే కొత్త నిబంధనల వల్ల కంపెనీలపై అదనపు ఖర్చు పెరగనుంది. ఎక్కువ మంది ఉద్యోగుల కోసం EPF చందాలు చెల్లించాల్సి రావడంతో సంస్థలు తమ పేరోల్, ఉద్యోగుల వివరాల నిర్వహణలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి కూడా పెన్షన్ పథకంలో తన వాటా పెంచాల్సిన పరిస్థితి రావచ్చు.
EPF వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.15వేలకు పెంచారు. ఇప్పుడు దాన్ని రూ.25వేలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించింది. ఈ మార్పుతో సంఘటిత రంగంలోని మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రత అందే అవకాశం ఉంది.