Reading Time: 2 minutes
వరుసగా 10 బాల్స్.. కట్‌చేస్తే.. కావ్యమారన్ టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన పాక్ ప్లేయర్..!

‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో ఊహించని ఉత్కంఠ పోరు అభిమానులను సీటు అంచులపై కూర్చోబెట్టింది. గెలుపుకు చేరువైన కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్‌కు పాకిస్థాన్ సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ ఊహించని షాకిచ్చాడు. వరసగా వేసిన 10 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి ట్రెంట్ రాకెట్స్‌కు 5 పరుగుల ఉత్కంఠ విజయాన్ని అందించాడు!

ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఈ 17వ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ జట్టు ఆరంభం నుంచే బాదుడు షురూ చేసింది. మూడో స్థానంలో వచ్చిన ఐనెరిన్ డొనాల్డ్ కేవలం 19 బంతుల్లో 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి స్కోరు బోర్డుకు వేగం పెంచాడు. మరోవైపు ఓపెనర్ బెన్ డకెట్ 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. డకెట్ 47 బంతుల్లో 64 పరుగులు చేయగా, ఆఖరిలో టిమ్ డేవిడ్ వేగంగా ఆడటంతో ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్లకు 146 పరుగుల బలమైన స్కోరు సాధించింది.

సన్‌రైజర్స్ ధాటి.. పీక్‌కు చేరిన ఉత్కంఠ..

147 పరుగుల సాధించదగిన లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జాక్ క్రాలీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన మార్కు హిట్టింగ్‌తో చెలరేగిపోవడంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మొగ్గింది. చివరి 20 బంతుల్లో విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి. క్రీజులో సెట్ అయిన హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్ ఉండటంతో సన్‌రైజర్స్ విజయం నల్లేరుపై నడకే అని కావ్య మారన్ క్యాంప్‌తో పాటు అభిమానులంతా భావించారు.

ఆమిర్ వరుసగా 10 బంతులు.. మారిన మ్యాచ్ ఫలితం..

అలాంటి క్లిష్ట సమయంలో ట్రెంట్ రాకెట్స్ కెప్టెన్ బంతిని మహ్మద్ ఆమిర్ చేతికి ఇచ్చాడు. ది హండ్రెడ్ నిబంధనల ప్రకారం ఒకేసారి వరుసగా 10 బంతులు (2 సెట్లు) వేసే వెసులుబాటును ఆమిర్ అద్భుతంగా వాడుకున్నాడు. కేవలం 10 పరుగులే ఇచ్చి 46 పరుగులు చేసిన ప్రమాదకర హ్యారీ బ్రూక్‌ను, ఆ వెంటనే 41 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌లను పెవిలియన్ పంపించాడు. ఈ జంట వికెట్ల దెబ్బకు సన్‌రైజర్స్ లీడ్స్ ఒక్కసారిగా తేరుకోలేని దెబ్బతింది. చివరి 10 బంతుల్లో 25 పరుగులు అవసరం కాగా, మిగిలిన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 141 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో తీవ్ర నిరాశకు గురైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..