
Agadha Trailer: మిస్టరీ, హారర్, అతీంద్రియ ఎలిమెంట్స్ తో వచ్చే కంటెంట్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ‘అగధ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్. రాజు, మరోసారి దర్శకుడిగా హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో వస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ తో ఆడియన్స్ ను వణికించేలా కనబడుతోంది. భిన్నంగా రూపొందించిన ‘అగధ’ ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతోంది. కథను నేరుగా చెప్పకుండా, సీక్రెట్ ను క్రమంగా విప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. గర్భవతిగా ఉన్న మహిమ పాత్ర ఆత్మహత్యతో కథ ప్రారంభమవుతుంది. ఆ మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి బయలుదేరిన మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల కనిపిస్తారు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ, ఇది మామూలు నేరం కాదని, ‘అగధ’ అనే అతీంద్రియ శక్తి ఈ ఘటన వెనుక ఉందనే విషయం బయటపడుతుంది. అక్కడి నుంచే మంచికి, చెడుకు మధ్య జరిగే ఆధ్యాత్మిక పోరాటం కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది.
ట్రైలర్‌లో కామాక్షి భాస్కర్ల తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతినాయకుడిగా కనిపించిన శ్రవణ్ రెడ్డి భయానకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. మొత్తానికి ‘అగధ’ ట్రైలర్ కి మంచి మార్కులే పడుతున్నట్లు కనిపిస్తోంది. భారీ ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన లుక్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఇంటెన్స్ విజువల్ ట్రీట్ కనిపిస్తోంది. రాకేష్ వెంకటపురం అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను మరింత పెంచుతూ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎం.ఎస్. రాజు అందించగా, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. అజయ్ కె.ఆర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్.వి.ఎన్. సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కథకు ప్రాధాన్యం ఉన్న విభిన్న సినిమాలను ఆదరిస్తున్న నేపథ్యంలో, ‘అగధ’ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పౌరాణిక నేపథ్యం, మిస్టరీ, హారర్, అతీంద్రియ అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే, సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘అగధ’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఇచ్చిన హామీని సినిమా నిలబెట్టుకుంటే, ఈ ఏడాది అతీంద్రియ థ్రిల్లర్ల జాబితాలో ‘అగధ’ ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తోంది.