
ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా మంది ముందుగా గుర్తుకు వచ్చేది ఈక్విటీ లేదా స్టాక్ మార్కెట్. ఎక్కువ రాబడులు రావాలంటే మొత్తం డబ్బును ఈక్విటీలో పెట్టాలనే అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ 26 ఏళ్ల డేటా చెబుతున్న నిజం మాత్రం వేరే. ఈక్విటీతో పాటు గోల్డ్, డెట్‌ను సరైన నిష్పత్తిలో కలిపి పెట్టుబడి పెడితే రాబడులు మాత్రమే కాదు, స్థిరత్వం కూడా గణనీయంగా పెరుగుతుందని విశ్లేషణ వెల్లడించింది.
70:15:15 ఫార్ములా ఏంటి?
70 శాతం ఈక్విటీ, 15 శాతం డెట్, 15 శాతం గోల్డ్ కలిగిన పోర్ట్‌ఫోలియో గత 26 ఏళ్లలో అత్యంత స్థిరమైన పనితీరును కనబరిచిందని ఫండ్స్‌ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2000 జనవరి నుంచి 2026 జూన్ వరకు ప్రతి 7 సంవత్సరాల కాలాన్ని పరిశీలించగా, ఈ పోర్ట్‌ఫోలియో 100లో 92 సార్లు కనీసం 10 శాతం వార్షిక రాబడిని అందించింది. ప్రతి ఏడాది ఒకసారి పోర్ట్‌ఫోలియోను తిరిగి 70:15:15 నిష్పత్తికి రీబ్యాలెన్సింగ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది.
ఈక్విటీతో సమాన రాబడి.. కానీ తక్కువ రిస్క్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మిశ్రమ పోర్ట్‌ఫోలియో సగటున 15 శాతం వార్షిక రాబడిని నమోదు చేసింది. ఇది నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చిన సగటు రాబడికి సమానమే. అయితే మార్కెట్ పతనాల సమయంలో ఈ మిక్స్ అసలు బలం కనిపించింది. ఈ పోర్ట్‌ఫోలియోలో కనిష్ఠ 7 సంవత్సరాల రాబడి 7 శాతంగా ఉండగా, నిఫ్టీ 50లో అది 5 శాతానికి పడిపోయింది.
ఈ ఫార్ములాలో ప్రతి ఆస్తి ప్రత్యేక పాత్ర పోషించింది. ఈక్విటీ సంపదను పెంచే ప్రధాన ఇంజిన్‌గా పనిచేస్తే, డెట్ మార్కెట్ ఒడిదుడుకుల్లో స్థిరత్వాన్ని ఇచ్చింది. గోల్డ్ మాత్రం మార్కెట్ పడిపోయినప్పుడు రక్షణ కవచంలా నిలిచింది. ఒక ఆస్తి బలహీనపడిన సమయంలో మరో ఆస్తి బలపడటం వల్ల మొత్తం పోర్ట్‌ఫోలియోపై ప్రభావం తగ్గింది.
ఈ రీసెర్చ్ చెప్పే సీక్రెట్ సందేశం ఒక్కటే. ఎక్కువ లాభాల కోసం మంచి స్టాక్‌లు వెతకడం మాత్రమే కాదు, సరైన అసెట్ అలొకేషన్ కూడా అంతే ముఖ్యమైనది. మీ వయస్సు, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా ఈక్విటీ, డెట్, గోల్డ్‌లను సమతుల్యంగా ఉంచితే దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు పొందే అవకాశం పెరుగుతుంది. మార్కెట్ ఎంత మారినా, సరైన మిక్స్‌తో పెట్టుబడి పెడితే సంపద సృష్టి మరింత సులభమవుతుందని ఈ 70:15:15 ఫార్ములా మరోసారి నిరూపించింది.