
హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల గడువు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తాత్కాలికంగా యుద్ధం ఆపివేస్తున్నానని ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది. పశ్చిమాసియాలో 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఇంకేమాత్రం యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేసారా? అనే అనుమానం నేడు ప్రపంచం అంతటా కలుగుతుంది. ఇరాన్‌లో ప్రభుత్వం మారాలి, ఆ దేశంలో అణుసామర్థ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి, ఆ దేశం సైనిక సామర్థ్యం అంతరించిపోవాలి అంటూ నిత్యం ఎన్నెన్నో ప్రకటనలు చేస్తూ వచ్చిన ఆయన రాజీకోసం రెండు రోజులుగా ఇరాన్‌తో జరుపుతున్న చర్చల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో మన మధ్య ఉన్న శతృత్వాలకు పూర్తి పరిష్కారంపై గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన చర్యలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. లోతైన, విశ్లేషణాత్మక, నిర్మాణాత్మక చర్యలు ఈ వారంలో కూడా కొనసాగుతాయి.
కొనసాగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం కానున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సాదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను భద్రతా దళాన్ని ఆదేశించాను అని ప్రకటించారు. ట్రంప్ వాదనలను కొట్టిపారేసిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది. తమ విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకొంటే, అదే రీతిన ప్రతిదాడులు చేయడంతోపాటు హర్మూజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇరాన్ వెల్లడించింది. కానీ, ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టు చెబుతున్న ట్రంప్ ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రతినిధులు ఇరాన్‌కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఏదిఏమైనా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడటం మొత్తం ప్రపంచ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇటీవలకాలంలో మొత్తం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేసిన మరో యుద్ధం లేదని చెప్పవచ్చు.
అందుకు ప్రధాన కారణం చమురు సరఫరాకు ఆటంకం కలగటమే. కాగా, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాతనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేశారని ఐరోపా పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి నాయకులతో ఈ వారంలోనే చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్‌ను ఒక వేదికగా పాకిస్తాన్ ప్రతిపాదించిందని తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో చర్చలు జరిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ‘అంతరాన్ని పూడ్చేందుకు’ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టులతో కలిసి ‘చురుకైన రహస్య దౌత్యం’లో నిమగ్నమై ఉందని, ఈ విషయాన్ని ఒక అధికారి ధృవీకరించారని పాకిస్తాన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ కూడా నివేదించింది.ఈ ప్రక్రియలో మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా పాలుపంచుకున్నారని ఆ అధికారి తెలిపారు.
ఈ మొత్తం యుద్ధం సమయంలో ఓ విధంగా ‘ప్రేక్షక పాత్ర’ వహించిన భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉద్రిక్తలను అదుపు చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించే ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇరాన్‌పై దురాక్రమణలను అరికట్టడంలోనూ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలోనూ బ్రిక్స్ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ అధ్యక్షుడు డా. మసూద్ పెజెష్కియన్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి సూచించడం గమనార్హం. అణుకార్యక్రమం రద్దు చేసుకోవడమే కాకుండా, తమ దేశంలో ఈ విషయమై ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతోపాటు అమెరికా ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకొనేందుకు కూడా ఇరాన్ సమ్మతి తెలిపింది. ఆ తనిఖీల విషయమై తదుపరి సాంకేతికపరమైన చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో యుద్ధం ప్రారంభించారు. అయితే, వెనెజులాలో మాదిరిగా ఇరాన్ అత్యున్నత నేతలను చంపివేస్తే ఆ దేశం లొంగిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆ దేశంనుండి వారెవ్వరూ ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
గత 20 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం తమ ఉనికిని ప్రశ్నిస్తున్న ఇజ్రాయెల్, అమెరికాల నుండి ముప్పు ఉందని, ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా గత జూన్ లో 12 రోజుల యుద్ధం జరిగినప్పటి నుండే పూర్తిస్థాయి యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించింది. పైగా, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకొంటూ, సొంతంగా ఆ దేశం ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని గ్రహించలేకపోయారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు సైతం ఓ పెద్ద గుణపాఠం అని చెప్పాలి. 200కు పైగా బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాతో ఏర్పాటు చేసుకున్న రక్షణ ఒప్పందాలు ఇరాన్ నుండి వాటికి భద్రతను కల్పించలేకపోయాయి. వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌పై కన్నా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా డ్రోన్‌లను ప్రయోగించడం ద్వారా అమెరికా ప్రయోజనాలపై ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతీశారు. అందుకనే భారీ వ్యయంతో ఆయుధాలను సమకూర్చుకోవడంకన్నా ఆధునిక కాలంలో దౌత్య సంబంధాలే గట్టి రక్షణ కల్పించగలవనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వగలిగింది. ఈ సందేశం ప్రపంచంలో పొరుగుదేశాలతో ఘర్షణలు ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు ఓ గుణపాఠం కాగలదు. తనను చంపటమే అమెరికా మొదటి లక్ష్యం అని ఖమేనీ ముందే గ్రహించారు. తాను చనిపోయినా అమెరికా ఒత్తిడులకు లొంగని నాయకత్వాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చారు. అటువంటి ప్రణాళికలు, సన్నాహాలు అమెరికా, ఇజ్రాయెల్ లలో కనిపించడంలేదు. పైగా, అమెరికా సైన్యం ‘ప్రచ్ఛన్న శీతల యుద్ధం’ కాలంలో పోరాడే విధంగా, ఆధిపత్యం కోసం, కండరాలను వంచడానికి, తమ ఆర్థిక- సైనిక బలగాలను చూపి బెదిరింపులతో లొంగదీసుకోవడానికి పేరొందింది. పటిష్టమైన యుద్ధ సన్నద్ధతకు తోడు కంటికి కనిపించని, తేలికగా లొంగిపోని ‘మొజాయిక్ డిఫెన్స్’ అనే రక్షణ కోట వ్యూహాత్మక అడుగులు అమెరికాను ఆశ్చర్యపరిచాయి.
ఈ దళానికి ఆద్యుడు మహమ్మద్ అలీ జఫారీ. వెనుజువెలా తరహాలో ఒక్కరోజులోనే ఇరాన్‌లో నాయకత్వ మార్పు తీసుకురావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, సైనిక అధికారులు, అణు ఇంధన శాస్త్రవేత్తలు నేలకొరిగినా ఇరాన్‌లోని మూడు వారాలు దాటినా ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూనే ఉండటాన్ని మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరచేటట్లు చేసింది. కేంద్రీకృతంగా కాకుండా పలు అంచెలుగా విభజితమై శత్రుసేనల్ని కంగుతినిపించే సామర్ధ్యం కలిగిన మొజాయిక్ డిఫెన్స్ తమ స్టయిల్ దాడులతో అమెరికాను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటన్నింటిని మించి ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు ఎవ్వరూ ట్రంప్ లేదా అమెరికాను నమ్మటం లేదని ఈ సందర్భంగా స్పష్టం అయింది. అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ వీధులలో భీకర నిరసనలు తెలుపుతున్న మహిళలు, యువత, మరెవ్వరూ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికాకు మద్దతుగా రాలేదు.
‘మీ ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకోండి’ అంటూ ట్రంప్ వారిని రెచ్చగొట్టినా వారెవ్వరూ స్పందించలేదు. అమెరికన్ సైన్యం 21వ శతాబ్దపు ఆధునిక యుద్ధంతో పోరాడటానికి సిద్ధంగా లేదని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అదీగాక, భారీ అమెరికా యుద్ధ యంత్రాంగం ఖరీదైనది. అది నిదానంగా, నెమ్మదిగా కదిలేది. వేగంగా, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా తిరగబడే స్వభావం దానికి లేదు. బలప్రదర్శనతో విర్రవీగడమే గాని వ్యూహాత్మకంగా అడుగులు వేసే అలవాటు లేదు. వీటన్నిటితోపాటు, అమెరికా సైన్యం అవినీతికి పేరొందింది. పెంటగాన్, జనరల్స్ ముడుపులు తీసుకొని ఆయుధాలు, యుద్ధ పరికరాలను అప్పగించడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుత యుద్ధంలో అమెరికా కన్నా ఇరాన్ వ్యూహాత్మకంగా ముందంజలో ఉందని ట్రంప్ వ్యవహారాలపై నిశితంగా అధ్యయనం జరుపుతున్న ప్రొఫెసర్ జియాంగ్ జోక్విన్ తెలిపారు.
చలసాని నరేంద్ర
98495 69050