Reading Time: 2 minutes

భారత్ అమెరికా మధ్య 2022 నుండి 2025 వరకు వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. అయితే ఈ విస్తరణ వెనుక ఒక ముఖ్యమైన ఆర్థిక వాస్తవం దాగి ఉంది. వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్). భారత్‌కు అమెరికాతో ఉన్న వాణిజ్యం పరిమాణంలో పెరుగుతున్నప్పటికీ, సమతుల్యత లోపం మాత్రం మరింత స్పష్టమవుతోంది. ఈ కాలంలో ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు మాత్రమే కాకుండా, వాటి నిర్మాణం, విధానపరమైన మార్పులు, గ్లోబల్ రాజకీయాల ప్రభావం కూడా ఈ అసమానతను అర్థం చేసుకోవడానికి కీలకం. 2022 సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకు జరిగిన ఎగుమతులు సుమారు 75 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు నమోదయ్యాయి.

అంటే భారత్‌కు సుమారు 25 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కనిపించింది. ఇది చూస్తే భారత్ కు లాభదాయకంగా అనిపించినా, ఈ లాభం కొన్ని ప్రత్యేక రంగాలపై అధికంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఐటి సేవలు, ఔషధాలు, వస్త్రాలు వంటి రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి. 2023లో ఈ వాణిజ్య పరిమాణం మరింత పెరిగింది. భారత్ ఎగుమతులు 78 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా దిగుమతులు భారత్ లోకి 55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఏడాది కూడా భారత్‌కు సుమారు 23 బిలియన్ డాలర్ల మిగులు ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అమెరికా భారత్‌కు ఎగుమతులు చేసే వస్తువుల విలువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రక్షణ సామగ్రి, ఇంధన వనరులు, సాంకేతిక పరికరాలు వంటి రంగాల్లో అమెరికా ప్రభావం పెరిగింది. 2024 నాటికి ఈ వ్యాపారం మరింత వ్యూహాత్మకంగా మారింది. భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు సుమారు 82 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు 60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు సుమారు 22 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం భారత్ అమెరికా నుండి పెరుగుతున్న ఇంధన దిగుమతులు, ముఖ్యంగా క్రూడాయిల్, ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్). రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకోవడం దీనికి కారణం.

2025లో ఈ ధోరణి మరింత స్పష్టమైంది. భారత్ ఎగుమతులు సుమారు 85 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి దిగుమతులు 65 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు 20 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే నాలుగేళ్లలో భారత్‌కు ఉన్న వాణిజ్య లాభం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఒక ఆందోళనకరమైన సంకేతంగా భావించాలి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తుంది. భారత్ ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, అమెరికా నుండి దిగుమతులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక బలహీనతలు. ముఖ్యంగా హైటెక్ తయారీ, అధునాతన రక్షణ ఉత్పత్తులు, ఇంధన స్వావలంబన లోపం వంటి అంశాలు భారత్‌ను అమెరికాపై ఆధారపడేలా చేస్తున్నాయి. విమర్శనాత్మకంగా చూస్తే ఈ వాణిజ్య సంబంధం సమాన భాగస్వామ్యం కంటే, ఆధారపడే సంబంధంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని ఉపయోగించి భారత్ మార్కెట్‌ను విస్తరిస్తోంది. మరోవైపు భారత్ తన సేవా రంగం ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీయవచ్చు.

మరొక ముఖ్యమైన అంశం గ్లోబల్ రాజకీయాల ప్రభావం. అమెరికా, -చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలకోసం భారత్‌ను వినియోగించుకుంటోంది. రక్షణ ఒప్పందాలు, ఇంధన సరఫరా ఒప్పందాలు ఈ దిశగా స్పష్టమైన ఉదాహరణలు. 2022 నుండి 2025 వరకు అమెరికా- భారత్ వాణిజ్య సంబంధాలు విస్తరించినప్పటికీ, సమతుల్యత లోపం ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది. గణాంకాల ప్రకారం భారత్‌కు ఇంకా మిగులు ఉన్నప్పటికీ, అది క్రమంగా తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీన్ని సరిదిద్దాలంటే భారత్ తన తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. ఇంధన స్వావలంబన సాధించాలి, సాంకేతికతలో ముందడుగు వేయాలి. లేకపోతే ఈ వాణిజ్య సంబంధం ఏకపక్షంగా మారే ప్రమాదం ఉంది.

కోలాహలం రామ్‌కిశోర్

98493 28496