
పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నా ఇంకా కొన్ని లక్షల మంది ఓటర్ల భవిత ఎటూ తేలక న్యాయ పరిశీలనలో ఉండడం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్షాళన ప్రక్రియలో దాదాపు 64 లక్షల ఓటర్ల పేర్లు తొలగించడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో తొలగింపునకు గురైన ఓటర్ల విషయంలో సుప్రీం కోర్టు జోక్యంతో న్యాయపరిశీలన జరుగుతున్నప్పటికీ ఇంకా దాదాపు 30 లక్షల మంది తుది నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారంటే ఈ ఎన్నికలు ఎంత గందరగోళం రేపుతున్నాయో తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) చేపట్టక ముందు పశ్చిమబెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7కోట్ల 89 లక్షలు ఉండేది. స్థానికంగా వారు లేరని, కొందరికి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, మరికొందరికి సరైన రికార్డులు లేవని ఇలా వివిధ కారణాలతో ఎన్నికల కమిషన్ 64 లక్షల ఓటర్లను జాబితాల్లోంచి తొలగించింది.
మరింత స్క్రూటినీ అవసరం అన్న కేటగిరి కింద మరో 60 లక్షల మంది ఓటర్ల పేర్లు ఉంచింది. దీనిపై ఫిర్యాదుల వెల్లువ రావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన ఓటర్ల వివరాలను పరిశీలించి న్యాయం చేకూర్చాలని ప్రత్యేకంగా న్యాయాధికారులను ఏర్పాటు చేయించింది. అలాగే వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి కలకత్తా హైకోర్టు పర్యవేక్షణలో 19 ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 60 లక్షల ఓటర్లలో న్యాయాధికారులు పరిష్కరించిన 29 లక్షల ఓటర్ల జాబితా సోమవారం రాత్రి విడుదలయింది. సోమవారం ప్రకటించిన తొలి అనుబంధ జాబితాలో మంత్రి గులాం రబ్బనీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పేర్లు కూడా ఉండడం గమనార్హం. బుధవారం వరకు 60 లక్షల ఓటర్లలో 32 లక్షల ఓటర్లు న్యాయపరిశీలనలోనే ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. ఈ 32 లక్షల ఓటర్ల పేర్లలో కనీసం 40 శాతం అంటే దాదాపు 13 లక్షల మంది పేర్లు జాబితా లోంచి తొలగించినట్టు అనధికారిక సమాచారం.
ఇంకా 28 లక్షల మంది ఓటర్ల పేర్లు న్యాయపరిశీలనలోనే చిక్కుకున్నాయి. వీరంతా తాము ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుందో లేదో అన్న సందిగ్ధంలో నిరీక్షిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మొదటి సప్లిమెంటరీ జాబితా 10 లక్షల పేర్లతో మార్చి 23 అర్ధరాత్రిని విడుదల చేసింది. ఆ జాబితా విడుదల చేసి 40 గంటలైనా కూడా మొదటి జాబితాలో పేర్లు ఎందుకు తొలగించారో అధికారిక సమాచారం ఏదీ లేదు. రాష్ట్రం మొత్తం మీద 60 లక్షల పేర్లు 700 జ్యుడీషియల్ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నియోజకవర్గాలు, బూత్‌లవారీగా ఆన్‌లైన్‌లో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ కాగితాలపై జాబితాలు కనిపించడం లేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ సదుపాయం లేకుంటే వారికి ఎలాంటి సమాచారం అందనట్టే. అదీ కూడా ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్ లోకి పేర్లు వెళ్లినప్పుడే ఓటర్లు వ్యక్తిగతంగా పరిశీలించుకోగలుగుతారు. ఎవరి పేర్లు అయితే తొలగించబడ్డాయో వారు రాష్ట్రం లోని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 19 ట్రిబ్యునళ్లలో అప్పీలు చేసుకోవచ్చు. ఆ విధంగా వచ్చిన అభ్యంతరాలను ట్రిబ్యునళ్లు తిరిగి పరిశీలిస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ కేవలం నెలరోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశీలన పూర్తవుతుందా? అన్నదే ప్రశ్న. పరిష్కరించిన ఓటర్ల సప్లిమెంటరీ జాబితాలను ప్రతీ శుక్రవారం ప్రకటించే బదులు, ప్రతిరోజూ విడుదల చేయడానికి కలకత్తా హైకోర్టు అనుమతిని ఎన్నికల అధికారులు పొందారు.
కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక మంది తమ పేర్లు తొలగించబడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మాల్దా జిల్లా సుజాపూర్ నియోజకవర్గం లోని శిలంపూద్ ఒకటో గ్రామ పంచాయతీ ఏరియాలో 522 మంది ఓటర్లు న్యాయపరిశీలనలో ఉన్నారు. అయితే వీరిలో 427 మంది పేర్లు తొలగించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ పౌరులమైన తాము ఇప్పుడేం చేయాలి? అని 70 ఏళ్ల వృద్ధుడు ప్రశ్నిస్తున్నారు. ఈ వృద్ధుని పేరు కూడా జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించేశారు. సర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ భారీ ఎత్తున పేర్లు తొలగించబడ్డాయని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగాల్‌లో మరో సమస్య తెరపైకి వచ్చింది. సరిహద్దు లోని ఓటర్లు చొరబాటుదారులుగా వారిని ఈసారి గుర్తించడం లేదు.
1972 లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో కాందిశీకులు భారత్‌కు తరలి వచ్చారు. వారిలో అత్యధికులు ముస్లింలు. 1974 లో భారత్ బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం అమలు లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా తమకు భారత పౌరసత్వ గుర్తింపు లభించినప్పటికీ వీరిని ఎన్నికల కమిషన్ ‘అనిశ్చితి’ కేటగిరిలో ఉంచింది. 2002 ఓటర్ల జాబితాలో వీరికి చట్టపరమైన డేటా లేదని ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. ఇటువంటి వందల కుటుంబాలు ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయి తార్కిక వాదంలో ఇరుక్కున్నారు. మార్చి 23న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరి పేర్లు లేవు. ఈ కారణంగా వీరి ఓటు హక్కు సందిగ్ధంలో ఊగిసలాడుతోంది. పౌరులుగా ధ్రువీకరణ పత్రాలు లేక ఓటు హక్కు కోల్పోయిన ఇటువంటి వారి ఓటు హక్కు రక్షణ కోసం గట్టిగా పోరాటం సాగిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.