Reading Time: 4 minutes

స్త్రీల ఉద్యమాలు దేశం నలుమూలలా ఎగిసిపడుతున్న రోజులవి! హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనంతరం వేళ్ళూనుకున్న పౌరహక్కుల ఉద్యమంలో, స్త్రీలపై హింస, అత్యాచారాలను (రమాజాబీ ఘటన) నిరసిస్తూ, విదేశాలకు కూరగాయలని ఎగుమతి చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చెలరేగిన ఉద్యమాలలో భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న స్త్రీశక్తి సంఘటన స్త్రీల ఉద్యమ నిర్మాణానికి పూనుకుంది. సంఘటనలో సభ్యులు కొందరు వామపక్షవాద నేపథ్యంలో వచ్చిన వాళ్ళయితే, కొందరు స్త్రీవాద రాజకీయాల స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు.

పైన చెప్పిన ఉద్యమాల్లో పాల్గొన్న ఇతర స్త్రీలు చాలా మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉండటం, వాళ్ళు మాతో గత అనుభవాల్ని పంచుకోవటం, మాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. 1948, 50 సంవత్సరాలలో జరిగిన ఆ చరిత్రాత్మక రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ అనుభవాలను సేకరించి దేశంలో స్త్రీ ఉద్యమ చరిత్రగా మలచాలనేది మాలో కలిగిన తలంపు మరుగునపడిపోయిన ఆ స్త్రీల జీవిత కథలు, మన దేశ ప్రజల పోరాటాల్లో స్త్రీల చరిత్రల్ని పొందుపరిచి ‘మనకు తెలియని మన చరిత్ర’ రూపొందించాలనే సంకల్పానికి అది దారి తీసింది.

‘మనకు తెలియని మన చరిత్ర’ తొలిసారి 1986లో తెలుగు ప్రచురణ అయింది. 1986లో దాని ఇంగ్లీషు అనువాదం ‘కాళి ఫర్ ఉమెన్’ ప్రచురణ కర్తలు, 1989లో జెడ్ బుక్స్ ప్రచురించారు. ఈ పుస్తకం తెలుగులో తిరిగి 2002లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఇంగ్లీషులో మాత్రం ఇప్పటి వరకూ తిరిగి ముద్రణ జరగలేదు. 80లలో ‘మనకు తెలియని మన చరిత్ర’ అధ్యయన సమయంలో స్త్రీ శక్తి సంఘటనలో ‘మౌఖిక చరిత్ర’లను సేకరించే ప్రయత్నం చేస్తున్నామన్న అవగాహనకన్నా, ఒక రాజకీయ స్పృహతో ఉద్యమంలో స్త్రీల జీవిత కథనాలను, వారి స్వీయానుభవాలను వారి మాటల్లో, వారి వారి భాషల్లోనే రికార్డు చేయటం, వాటిని యథాతథంగా పాఠకులకు అందించటం అన్న లక్ష్యాలు ప్రధానంగా ఉండేవి. తర్వాత కాలంలో పుస్తకాన్ని స్త్రీల అధ్యయన కేంద్రాలు, చరిత్ర బోధించే విశ్వవిద్యాలయ అధ్యాపకుల రాజకీయ పోరాటాలలో స్త్రీల గురించి అధ్యయనం చేసే స్త్రీవాద ఉద్యమాలూ, రాజకీయ కార్యకర్తలు మనకు తెలియని మన చరిత్రను ఒక మార్గదర్శక గ్రంథం textగా వాడుతూ వస్తున్నారు.

పోరాటాలు, ఉద్యమాలు, వ్యూహాలు నిర్మించటంలో చరిత్రల్లో స్త్రీలున్నా, లిఖించే సమయానికి వాళ్ళ ప్రసక్తి కనుమరుగైపోవటం సర్వసాధారణం. అంతేకాదు, వాళ్ళ చరిత్రల్ని వాళ్ళే రికార్డు చేసుకోలేని నిరక్షరాస్యులైన స్త్రీల చరిత్రల్ని రాయటానికప్పుడు మౌఖిక చరిత్ర ఒక రాజకీయ పంథా అవుతుంది. ఈ మౌఖిక చరిత్ర సంప్రదాయమే ప్రధాన స్రవంతి పరిశోధనా పద్ధతులకు ఒక సవాలయింది. మనకు తెలియని మన చరిత్ర ముద్రణ జరిగిన సందర్భంలో వెతికితే మౌఖిక చరిత్రలు అతి తక్కువగా కనిపిస్తాయి. బహుశ ప్రపంచవ్యాప్తంగా కూడా చేతివేళ్ళ మీద లెక్కించవచ్చన్న విషయంలో సందేహం లేదు. విప్లవంలో స్త్రీల గురించిన పాండినోస్ డాటర్స్‘, బొలీనియన్ గనుల్లో స్త్రీ కార్మికురాలు డొమితులా ఆత్మకథ’ వంటి పుస్తకాలు మాకు స్ఫూర్తినిచ్చినయి. ‘మనకు తెలియని మన చరిత్ర’ తర్వాత మౌఖిక చరిత్ర ఒక మౌలిక అధ్యయన పద్ధతిగా స్థిరపడింది.

స్త్రీల చరిత్రను అధ్యయనం చేయటానికి స్త్రీలను కేంద్రంగా చూసే దృక్పథాన్ని ఎంచుకుంది. స్త్రీ శక్తి సంఘటన స్త్రీలు నిర్దేశించే విలువలతో పరిశీలిస్తే స్త్రీల చరిత్ర ఎట్లా ఉంటుంది? ఈ ప్రయత్నానికి కొత్త విజ్ఞానం, విభాగాలు, కొత్త మూలసూత్రాలు, కొత్త పునాదులు ఏర్పరచే అవసరం, కొత్త సాధనాల్ని సమకూర్చుకునే అవసరం ఎందుకు ఉంటాయనేది మనకు తెలియని మన చరిత్ర రుజువు చేసింది. ఉద్యమంలో స్త్రీల పాత్రను ఒక వాస్తవిక సంఘటనగా మాత్రమే కాకుండా ఆయా ఉద్యమాల అవగాహనల్లో ‘స్త్రీల ప్రశ్న’ ఏమిటన్న విషయాన్ని ప్రపంచం ముందుకు తెచ్చినటువంటి ప్రయత్నం అది!. తెలంగాణ రైతాంగ పోరాటంలో స్త్రీల ప్రశ్న గురించి కొత్త కోణాలలో అధ్యయనం చేసిన మనకు తెలియని మన చరిత్ర వైవిధ్యమైన అస్తిత్వాల రాజకీయ ప్రశ్నలు లేవదీయటానికి కొత్త దారులేసిందనే చెప్పాలి.

అటువంటి కొత్త రాజకీయ ప్రశ్నలలో ‘దళిత’ ప్రశ్న ఒకటి. 1980ల దశకం చివర్లోని (85లో కారంచేడు, 90లో చుండూరు) సంఘటనల సందర్భంగా దళిత ఉద్యమాలు నిర్మించి దళిత సంఘాలు స్థిరపడటం ఒక విశిష్ట ప్రక్రియ. ఇది ఏర్పడే వరకు దళిత ప్రశ్నను కొత్త కోణాలలో ఆవిష్కరించే సందర్భం, కొత్త దృక్కోణాలను, దృక్పథాలను పెంచుకోగలిగే మేధోపరమైన, భౌతికమైన పరిస్థితులు ఏర్పడలేదు. మనకు తెలియని మన చరిత్ర రాసే సమయానికి (1982-86ల మధ్య) ఆ పరిస్థితులు దాదాపు లేవనే విషయం గుర్తుంచుకోవాలి. విప్లవోద్యమాలలో, కమ్యూనిస్టు రాజకీయాలలో అంతర్భాగంగా స్త్రీలెట్లా ఉంటూ వచ్చారో, దళితలు కూడా అదే విధంగా ఉండి చరిత్ర లిఖించే సమయానికి వాళ్ళ ఉనికి లేకుండా పోవటం యాదృచ్ఛికం (accidental) కాదు అనే అవగాహన దళిత ఉద్యమం నిర్మించిన సందర్భంలోనే సాధ్యపడింది. వామపక్ష ఉద్యమాలలో దళితుల అస్తిత్వాన్ని గురించి, నాయకత్వ స్థానాల్లో వాళ్ళెప్పుడూ కనిపించక పోవటం గురించీ, వామపక్ష సంఘాలు, పార్టీలు దళిత బహుజనులను నిరంతరం అంచులకు పెట్టివేయటాన్ని ప్రశ్నిస్తూ దళిత రచనలు, వ్యాఖ్యానాలు రావటం అప్పుడే మొదలయింది. దళిత బహుజన నాయకులు పౌరహక్కుల సంఘాలలో, వామపక్ష పార్టీలలో దళిత ప్రశ్నలను లేవదీయటం ప్రారంభమయింది.

మనకు తెలియని మన చరిత్ర ప్రచురణ తర్వాత వామపక్ష వర్గాల నుంచి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంది. ఈ పుస్తకాన్ని అశాస్త్రీయ దృక్పథంతో రాసినదిగా; అట్టడుగు వర్గాల్లో, పోరాటాల్లో మమేకం కావల్సిన స్త్రీల ఉద్యమాల్ని విప్లవోద్యమాల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నంగా తిరస్కరించారు. ఇంకొక వ్యాఖ్యానంలో ‘స్త్రీ శక్తి సంఘటన వ్యక్తిగత అనుభవాల్ని చరిత్ర గురించి స్వీయాత్మక ధోరణిలో చర్చించి విశ్లేషణలను గాలికి వదిలి వేశారు’ అన్నారు.

అశాస్త్రీయమైన అవగాహనలు ముందు ముందు ఇతర అస్తిత్వం (subjectivities) ఉద్యమాలకు దోవచూపి కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బ తీసిందిగా రూపొందే ప్రమాదం ఉందనే వ్యాకులత (anxiety) కనిపిస్తుంది. ఆ వ్యాకులత వెనుక విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు సంబంధించినవైనా, దళిత, బహుజనులకు సంబంధించినవైనా అన్నీ విప్లవోద్యమంలో భాగంగా (అంతరంగికంగా) పోరాడాలే తప్ప, ప్రత్యేక ఉనికి (existence)ని చాటుకునేవిగా ఉండకూడదు అనే దృష్టి కోణానికి చెందినవి. ఈ విమర్శల మూలంగా పార్టీలు, మనకు తెలియని మన చరిత్రను పక్కకు పెట్టినా, ఉద్యమాలలో భాగమైన ఎంతో మంది స్త్రీలు దీన్ని చదివి స్ఫూర్తి పొందారు. వాళ్ళు భాగమైన పార్టీల్లో వారి స్థానాన్ని, ఉనికిని, ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించుకోగలిగే శక్తి నిచ్చింది ఈ పుస్తకం. వామపక్ష పార్టీలలో పని చేసిన తర్వాత తరాల స్త్రీ కార్యకర్తలలో ‘స్త్రీల ప్రశ్న’ గురించీ, స్త్రీవాదం గురించీ కుల, వర్గ దృక్పథాలతో ముడిపడి ఉన్న ఒక పటిష్టమైన అవగాహనను ఏర్పరచటానికి మనకు తెలియని మన చరిత్ర దోహదం చేసిందనటంలో సందేహం లేదు. తెలంగాణ నూతన రాష్ట్రంలో ఎన్నో రకాల రాజకీయ కార్యక్రమాల్ని ఉద్యమాల్ని నిర్వహిస్తున్న ఐక్యకార్యాచరణ చొరవలలో ఎక్కువ భాగం స్త్రీల, కుల, వర్గ, మతపరమైన సెక్సువల్ మైనారిటీల సంక్లిష్ట దృక్పథాలతో పని చేస్తున్న కార్యకర్తలు కనిపిస్తారనేది వాస్తవం!

అలాగే ‘మనకు తెలియన మన చరిత్ర’ పుస్తకంలో ఉన్న జీవితాలేవీ దళిత స్త్రీలవి కాదనీ, పుస్తక రచయితలలో కుల దృక్పథం గురించి ఏ మాత్రం అవగాహనలేదని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ పరిశోధన జరిగిన కాలంలో కులప్రశ్నకు అప్పటి సందర్భంలో తావులేదనే విషయాన్ని అంగీకరించారు. మనకు తెలియని మన చరిత్రలో దళిత ప్రశ్నతోపాటు ఇతర వైయక్తికత (subjective) ప్రశ్నలు (మైనారిటీ, గిరిజన, ఆదివాసీ) కూడా కనిపించవు. 90లలో మనకు తెలియని మన చరిత్రపై దళిత విమర్శ ముందుకొచ్చిన తర్వాత కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో దళిత స్త్రీల గురించిన అధ్యయనం ఇప్పటికీ జరగలేదనేది వాస్తవం.

తెలంగాణ భాష గురించి, దాని రాజకీయాల గురించి జీవిత కథనాల్ని స్త్రీల గొంతుల్లో స్వయంగా వాడిన పద ప్రయోగాల్లో వారి వారి స్వంత భాషల్లో పాఠకులకు అందచేయాలనే తపన ఈ పుస్తకంలో వుంది. మనకు తెలియని మన చరిత్ర తెలంగాణ భాషను వ్యక్తీకరించిన పుస్తకాలలో ఒకటని భావించటం జరిగింది. ఉమెన్స్ స్టడీస్ మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఒక నూతన విజ్ఞాన విభాగంగా రూపొందే సందర్భంలో (80లలో) ‘మనకు తెలియన మన చరిత్ర’ ప్రముఖమైన స్త్రీవాద గ్రంథంగా తెచ్చుకుంది. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు, మొదటిసారిగా మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అతికొద్ది పుస్తకాలలో ఒకటిగా; ఒకమౌలిక, మౌఖిక చరిత్రగా; రాజకీయ ఉద్యమాలలో ‘చరిత్ర వంటి జ్ఞాన విభాగంలో స్త్రీల చరిత్రను చూసే దృక్పధాన్ని స్థిరపరిచింది. ఇతర స్త్రీవాదులు మనకు తెలియని మన చరిత్ర ప్రారంభించిన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళారు. షీలా రొబోతమ్ ‘తెలియని మనచరిత్ర’ పుస్తకంపై చేసిన సమీక్షలో ‘ఇది ఒక స్త్రీల వీరోచితచరిత్ర మాత్రమే కాదు. ఈనాటి ప్రపంచంలో సోషలిజం, ఫెమినిజంలో ఉన్న సందిగ్ధాలు, ఊగిసలాటలు గురించిన గ్రంథం’ అని రాసింది. ఇవే ప్రశ్నలు ఇప్పటికీ వామపక్షాలలో సభ్యులైన స్త్రీలను వేధిస్తున్నాయనటంలో సందేహం లేదు. హైదరబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకంలో రెండు జీవిత కథల్ని కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం సంపూర్ణమైన ఆత్మకథలుగా మలిచి ముద్రించింది. తెలుగు స్త్రీవాద పత్రిక భూమికలో అన్ని జీవిత కథలు సంచికలుగా ముద్రించబడినయి.

కె. లలిత, అన్వేషి