Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: గత ప్ర భుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని, రాష్ట్రం లో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజిమెంట్ సిస్టమ్) ను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మం త్రి పొంగులేటి ప్రకటించారు. గురువారం రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్‌ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ ఉంటుందని ఆయన తెలిపారు.

నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లు కేటాయించాం

ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గీ, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని,

ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూ భారతి పోర్టల్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్‌ను ఇస్తామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లను కేటాయించినట్లు తెలిపారు.

మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ

ఒక క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా పోర్టల్లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్‌ఓఆర్, భూధార్ నెంబర్,

దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్, ఆర్‌ఓఆర్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం ఉంటుందన్నారు. అన్ని రకాల సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూ భారతి పోర్టల్‌ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్టేజ్ లో దాని వివరాలను తెలియజేస్తూ ఎస్‌ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్‌ఐసి అధికారులు పాల్గొన్నారు.