
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు కొంతమే ర కోలుకున్నాయి. బుధవారం మూతపడిన బంక్‌ల్లో కొన్ని తిరిగి గురువా రం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలతో సమీక్షలు జరిపి ట్యాంకర్‌లను సకాలంలో బంక్‌లకు తీసుకురావడంతో కొంతమేర సఫలీకృతమయ్యింది. దీంతో క్యూ లైన్‌లు కొంతమేర తగ్గాయి. శుక్రవారం నాటికి క్యూ లైన్‌లు లేకుండా చూస్తామని ఫౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బంక్‌లు తిరిగి ప్రారంభమయితేనే ఇబ్బందులు ఉండవని వాహనదారులు పేర్కొంటున్నా యి. కొన్ని బంక్‌ల్లో క్యూ అధికంగా ఉండడంతో గురువారం కూడా ఆ యా బంక్‌ల యజమానులు రేషనింగ్ పద్ధతిని ద్విచక్ర వాహనానికి రూ. 200ల పెట్రోల్, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.2 వేల పెట్రోల్, డీజిల్‌ను మాత్రమే పోయడం విశేషం. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టంతో బ్లాక్‌మార్కెట్ తగ్గిందని వాహనదారులు పేర్కొంటున్నారు. అయితే, గ్యాస్‌తో నడిచే ఆటోలకు మాత్రం తిప్పడం తప్పడం లేదు. ఆటోల లైన్‌లు మాత్రం కిలోమీటర్ల మేర ఉంటున్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ఆటోలకు పూర్తిస్థాయిలో గ్యాస్ అందడం లేదని బంక్ యజమానులు పేర్కొంటున్నారు.
ధరలను పెంచిన నయారా ఎనర్జీస్
ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ ’రాస్నెఫ్ట్’ భాగస్వామ్యం కలిగిన నయారా ఎనర్జీ లీటరు పెట్రోల్‌పై దాదాపు రూ. 5లు, డీజిల్‌పై రూ. 3 వరకు పెంచి సామాన్యుడికి షాక్ ఇచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా లేకపోవడం ఇంధన ధరలు పెంచినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ పెరిగిన ధరలను అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాలు విధించే వ్యాట్ (వ్యాట్) ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు గరిష్టంగా లీటరుకు రూ. 5.30 వరకు చేరింది. మరోవైపు దేశంలో 90 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియ కంపెనీల ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉండడం వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది.