
మన తెలంగాణ/హైదరాబాద్: “బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మీరు ఇచ్చిన తీర్పుపై మాకు వివరణ ఇవ్వండి..” అని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పీకర్ (ట్రిబ్యునల్) గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. అదేవిధంగా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇచ్చిన ఎమ్మెల్యేలకూ స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, కె. సంజయ్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేసు విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. స్పీకర్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా బుధవారం ఏడు మంది ఎమ్మెల్యేలు కాలె యాదయ్య,
టి. ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగుల సాక్షాధారాలను స్పీకర్‌కు అందజేసినా, స్పీకర్ ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు ఏమీ లేవంటూ కేసులను కొట్టి వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు గురువారం తన వాదన వినిపించారు. దీంతో ధర్మాసనం స్పీకర్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపించాలని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై ఇచ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.