
ఇల్లు గడిచేదెలా..పిలల్లలను పోషించేదెలా? బస్సు ప్రమాదంలో ఇది ఇంటిపెద్దను కోల్పోయిన వారి ఆక్రందన ఇది! అయ్యో కష్టపడి కొనుక్కున్న వస్తువులు బూడిదయ్యాయే? ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రుల ఆవేదన ఇది! మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతుంటే కళ్లు మూసినా, తెరిచినా అగ్నికీలలే గుర్తొస్తున్నాయంటూ క్షతగాత్రులు కలవరపడుతున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. ఈ బస్సు ప్రమాదంలో అమ్మమ్మను రక్షించే క్రమంలో మనవరాలు మృతిచెందిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో కనిగిరి మండలానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు.
కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన 80 ఏళ్ల తమ్మిశెట్టి పిచ్చమ్మ, ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు. ముందు ప్రాణాలతో బయటపడిన రుక్మిణి అమ్మమ్మను కాపాడేందుకు మళ్లీ బస్సులోకి వెళ్లారు. ఈ క్రమంలో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో రుక్మిణీ కూడా ప్రాణాలు కోల్పోయారు. రుక్మిణి భర్త తిరుపాలుకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో చల్లగిరగల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కనిగిరికి చెందిన పద్మ బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణ వెళ్లి శ్రీరామనవమికి సొంతూరు వస్తూ బస్సు ప్రమాదానికి బలయ్యారు.