
శ్రీరామనవమి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రజలకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా రాష్ట్రంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, ప్రతి రైతు తలెత్తుకుని జీవించేలా చేయాలని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పాలన చేస్తోందని చెప్పారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 సబ్సిడీకి గ్యాస్ సిలెండర్, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెల్ రెసిడెన్షియల్ స్కూల్స్,
యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్శిటి ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. రూ.586 కోట్లతో ప్రజా ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతుందని, గోదావరి పుష్కరాలకు ఘాట్‌ల అభివృద్ధి, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు డిప్యూటి సిఎం వివరించారు.